హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల ప్రతి విషయంలో వివక్ష చూపుతున్న కేంద్రం మరోసారి తన విషాన్ని వెళ్లగక్కింది. ఢిల్లీలోని రెండు తెలుగు రాష్ర్టాల మధ్యనున్న ఆస్తులు, భవనాల పంపకంలో తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు పూర్తి విరుద్ధంగా కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. 58.42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ఆస్తులను పంచుకోవాలని సూచించింది. ఢిల్లీ అశోకా రోడ్డులోని ఏపీ-తెలంగాణ భవన్‌ను పూర్తిగా తమకే వదిలేయాలని గత నెల 26న కేంద్ర హోంశాఖతో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రతిపాదించగా.. అందుకు భిన్నంగా దానిని ఏపీ కేటాయిస్తూ కేంద్రం తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు పూర్తి వ్యతిరేకంగా కేంద్రహోంశాఖ మరో ప్రతిపాదనను పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గోదావరి, శబరి, నర్సింగ్ హాస్టల్ మొత్తంగా 12.09 ఎకరాల భూమిని ఏపీ తీసుకోవాలని, 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని పేర్కొంది.
ఆస్తులను 58.42నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. ఏపీకి అదనపు భూమి దక్కితే ఆ మేరకు నిధులను తెలంగాణ ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా అభిప్రాయాలను తెలిపాలని ఇరు రాష్ర్టాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. అశోకా రోడ్డు, శ్రీమంత్ మాధవరావు సింధియా మార్గ్‌లో రెండు తెలుగు రాష్ర్టాలకు ఉమ్మడిగా 19.733 ఎకరాల భూమి ఉన్నది. అశోకా రోడ్డులోని తెలంగాణ-ఏపీ భవన్ 8.726 ఎకరాల్లో ఉండగా, సింధియా మార్గ్‌లో 7.640 ఎకరాల్లో పటౌడీ హౌస్ పూర్తిగా వేరుగా ఉంది. ఈ పటౌడీ హౌస్ భూమిని ఏపీ తీసుకోవాలని, ఏపీ-తెలంగాణ భవన్‌ను, దాని సమీపంలోని శబరి బ్లాక్, రోడ్డు, నర్సింహ హాస్టల్‌ను తమకే కేటాయించాలని తెలంగాణ అధికారులు గత సమావేశంలో ప్రతిపాదించారు. 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ రేటు ప్రకారం చెల్లిస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. ఇందుకు భిన్నంగా తెలంగాణ కోరిన ఆస్తులను హోం శాఖ ఏపీకి కేటాయిస్తూ ప్రతిపాదనలు చేసింది.