హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ర్టాలకు రూ.కో ట్లు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు. పథకం ప్రారంభంలో రాష్ర్టానికి రూ. 190 కోట్లు మంజూరు చేసినా, నిబంధనల పేరిట ఆ సొమ్మును వాపస్ అడుగుతుదున్నది. పీఎంఏవై-అర్బన్ కింద పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇస్తున్నా, ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అది చాలా తక్కువ. సొంత జాగా ఉన్న వాళ్లు ఇల్లు నిర్మించుకొనేందుకు రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ఈ విషయంలో రాష్ర్టానికి అండగా ఉండాల్సిన కేంద్రం మరోసారి చేతులు ఎత్తేసేంది.
ఎస్ఈసీసీ లెక్కతోనే అంటూ కేంద్రం మెలిక
పీఎంఏవై కింద సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ (ఎస్ఈసీసీ)లో ఉన్న పేదలకు మాత్రమే ఇండ్లు నిర్మించేందుకు నిధులు ఇస్తామని కేంద్రం నిబంధన పెట్టింది. కానీ, అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఆ సమయంలో వివరాల సేకరణ సరిగ్గా జరగలేదు. కొన్ని చోట్ల ఆ లిస్ట్‌లో ఉన్న వారి వివరాలు ఇప్పుడు దొరకటం లేదు. మరికొన్ని చోట్ల ఆ జాబితాలోని వారిలో కొందరు ఇప్పటికే ఇండ్లు కట్టుకొన్నారు. 30 శాతం మాత్రమే ఆ డాటాతో సరిపోలుతున్నారు. దీంతో కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని, నిబంధనలు సడలించాలని కేంద్రానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ మంజూరు కమిటీ సమావేశంలోనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదు. అదీ కాకుండా తొలి విడత కింద ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చినా కేంద్రం అంగీకరించడం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారు. పీఎంఏవై-రూరల్ కింద ఒక్కో ఇంటికి కేంద్రం రూ.72వేలు ఇస్తున్నది. ఈ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో తెలంగాణలో 50,959 ఇండ్లకు కేంద్రం తన వాటాగా రూ.381.58 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. తొలివిడతగా రూ.190 కోట్లు మంజూరు చేసింది. కానీ, 2011 ఎస్ఈసీసీ ప్రకారం జాబితాలోని వారిని లబ్ధిదారులుగా చూపించడం లేదని రెండో విడత నిధులు ఆపేసి, ఇచ్చిన నిధులను తిరిగివ్వాలని అడుగుతున్నది.
పనితీరు ఆధారంగా చూసినా నిధులు ఇవ్వాల్సిందే
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా 560 చదరపు అడుగుల్లో ఒక కిచెన్, రెండు టాయిలెట్లు, రెండు పడక గదులతో రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే మన దగ్గర పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2018-19లో పీఎంఏవై కింద తెలంగాణ 2 బీహెచ్‌కే పథకం ఎక్స్లెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఈ-గవర్నెన్స్ అవార్డును సైతం రాష్ట్రం సొంతం చేసుకొన్నది. పనితీరు ఆధారంగా చూసినా తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వక తప్పదు. కానీ, రాష్ట్రం ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా, కేంద్రం వివక్ష వైఖరినే ప్రదర్శిస్తున్నది.