హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తన వంకర బుద్ధిని మరోమారు ప్రదర్శించింది. నేరుగా వరి సాగు చేయొద్దు.. ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నది. రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ర్టాలకు సూచిస్తూ.. లోక్సభలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ ఓ ప్రకటన చేశారు. పప్పులు, నూనె గింజలు, చిరు ధాన్యాల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వీటికి కేంద్రం నుంచి మద్దతు ధర అందిస్తున్నామని తెలిపారు. రాష్ర్టాలు కూడా ఈ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా వరి సాగు చేయొద్దనిగానీ, ధాన్యం కొనుగోలు చేయబోమనిగానీ చెప్పలేదు. టీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది ఆ సీజన్ ప్రారంభంలో ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి గత యాసంగిలో 5 లక్షల టన్నుల బియ్యం ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నిస్తే.. రికార్డుల ప్రకారం 61.87లక్షల టన్నుల బియ్యం సేకరించామని, మొదట నిర్ణయించిన టార్గెట్ 55 లక్షల టన్నులకు అదనంగా సేకరించామని అన్నారు. తెలంగాణ నుంచి ఈ వానకాలం పంటలో 40 లక్షల టన్నులు కాకుండా 90 లక్షల టన్నులు సేకరించాలని సీఎం కేసీఆర్ కోరినదానిపై స్పందనేంటని ప్రశ్నించగా.. ముందుగా నిర్ణయించిన ప్రకారం 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అంగీకరించినట్టు తెలిపారు. మార్కెట్ పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగానే సేకరిస్తామని పేర్కొన్నారు.