విద్యుత్తు కోసం తెలంగాణ ఎవరి యాదాక్షిణ్యాలపైనా ఆధారపడొద్దన్న ముందుచూపుతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనోఫలకం నుంచి ఆవిర్భవించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పుడు కష్టకాలంలో రాష్ర్టాన్ని ఆదుకుంటున్నది. 24 గంటలపాటు ఫుల్ లోడ్‌తో నడుస్తూ.. రోజుకు 2 వేల మెగావాట్ల విద్యుత్తును అందిస్తూ తెలంగాణ అంధకారం కాకుండా కాపాడుతున్నది.
ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంటు రాష్ట్ర అవసరాలు తీరుస్తుండగా నాడు ‘ఈ ప్లాంట్ వ్యర్థం’ అని బద్నాం చేసిన కాంగ్రెసోళ్లే నేడు ‘ఇది మా గొప్ప’ అని ప్రచారం చేసుకుంటున్నారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ‘యాదాద్రి థర్మల్ ప్లాంట్ వృథా. ఇంత భారీ వ్యయంతో ప్లాంట్‌ను కట్టడం అవసవరమా? ఈ ప్లాంట్ నిర్మాణంలో జాప్యమయ్యింది. బొగ్గు గనులకు దూరంగా ప్లాంట్‌ను కట్టారు. నిర్మాణ వ్యయం.. అంచనాలు పెరిగాయి. విద్యుత్తు సంస్థలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపారు..’ ఇవీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దలు చేసిన ఆరోపణలు. పైగా ప్లాంట్‌ను నామినేషన్ పద్ధతిపై బీహెచ్ఈఎల్కు ఇవ్వడంపైనా కాంగ్రెస్ పెద్దలు అభ్యంతరం తెలిపారు. భారీ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా జస్టిస్ నర్సింహారెడ్డి, జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలో విద్యుత్తు విచారణ సంఘాలను ఏర్పాటు చేశారు. అనేక నిందలు మోపా రు. కానిప్పుడదే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) తెలంగాణకు వరప్రదాయినిగా మారింది. కారుచీకట్ల నుంచి బయటపడేసింది. కష్టకాలంలో ఆదుకున్నది. బహిరంగ మార్కెట్లో వి ద్యుత్తును కొందామంటే దొరకని పరిస్థితుల్లోను విద్యుత్తునందించి వెలుగులు నింపింది. 15 రోజుల క్రితం ఈ ప్లాంట్‌ను 16 గంటలపాటు బ్యాక్‌డౌన్ చేసిన సందర్భం. రోజులో 8 గంటలు నడిపిన పరిస్థితి. కానిప్పుడు 24 గంటలపాటు పుల్లోడ్తో ప్లాం ట్ నడుస్తున్నది. రోజుకు 2వేల మెగావాట్ల విద్యుత్తు ను రాష్ర్టానికి అందిస్తున్నది. రాష్ర్టాన్ని అంధకారమ యం కాకుండా కాపాడుతున్నది. అటు పీక్‌లోడ్.. పె రుగుతున్న డిమాండ్.. ఇటు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు దొరకని స్థితిలో రాష్ర్టాన్ని గట్టెక్కించింది.
రికార్డుల మోతలు..
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరిగింది. రికార్డుల మోతలు మోగించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగం, పీక్ డిమాండ్ ఈ నెలలోనే నమోదయ్యింది. ఈ నెల 13న రికార్డుస్థాయిలో పీక్ డిమాండ్ 18,228 మెగావాట్లు నమోదయ్యింది. అదే రోజూ రాష్ట్రంలో 341 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమయ్యింది. రాష్ట్ర విద్యుత్తు వినియోగం ప్రతిరోజూ 300 మిలియన్ యూనిట్లు దాటుతున్నది. అయితే ప్రతిరోజు 150 -120 మిలియన్ యూనిట్లు విద్యుత్తును బహిరంగ మార్కెట్లో, సీజీఎస్ ద్వారా రాష్ట్రం తీసుకోవాల్సి వస్తున్నది. బీటీపీఎస్ ప్లాంట్‌లో 270 మెగావాట్ల ప్లాంట్ నుంచి రోజుకు 220 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే అందుతున్నది. కానీ వైటీపీఎస్‌లోని 800 మెగావాట్ల రెండు యూనిట్లు, 1600 మెగావాట్ల ఫుల్‌లోడ్‌తో 24 గంటల పాటు నడిచినట్టు.. వాస్తవానికి ఇది రికార్డుగా జెన్కో ఇంజినీర్లు చెప్తున్నారు. నాలుగో యూనిట్ సైతం సేవలందిస్తున్నది. ఈ నెలలో ఇంకా ప్రారంభంకాని, గ్రిడ్‌తో అనుసంధానం కాని యూనిట్ -3 సైతం 22.78 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించింది.
కొందామన్నా దొరకని పరిస్థితుల్లో..
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పీక్కు చేరడంతో అధికారులు బయటకొనేందుకు ప్రయత్నించారు. నాన్ పీక్ అవర్స్‌లో సోలార్ విద్యుత్తును కొంటున్నారు. అయితే పీక్ సమయంలో విద్యుత్తు చౌకగా దొరకడంలేదు. మూడు, నాలుగు రోజుల క్రితం బయట విద్యుత్తును కొందామన్నా దొరకని పరిస్థితి. 500 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఇంధన ఎక్స్చేంజీలో లభ్యమయ్యింది. కొంతకాలం క్రితం యూ నిట్ రూ. 3-4లకే విద్యుత్తు బహిరంగ మార్కెట్లో దొరకగా, రూ. 12 -13 పెట్టి కొందామన్నా విద్యుత్తు లభించని పరిస్థితులొచ్చాయి. ఈ కీలక క్లిష్టసమయంలో యాదాద్రి ప్లాంట్ అక్కరకొచ్చింది. అధికారులు ఉత్పత్తి పెంచాలంటూ జెన్కో మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్..
యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ కలల ప్రాజెక్ట్. ప్రస్తుత అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తు డిమాండ్‌ను తీర్చేందుకు, రాష్ట్రం ఎవరిపై ఆధారపడకూడదన్న దూరాలోచనతో కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. యాదాద్రి ప్లాంట్ ప్రణాళికలు, నిర్మాణం, నిధుల సేకరణ ప్రతి విషయంలో కేసీఆర్ భాగమయ్యారు. అనేక మార్లు సమీక్షలు నిర్వహించారు. అధికారులను పరుగులు పెట్టించారు. క్షేత్రస్థాయి సందర్శనలు జరిపారు. 70శాతం పనులు పూర్తిచేయించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో సర్కార్ మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో ఏ విషయంలోను కాంగ్రెస్ నేతలకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇసుమంతైనా భాగస్వామ్యం లేదు. కానీ ఇప్పుడదే ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్తు రాష్ట్ర అవసరాలను తీరుస్తుంటే అది తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.
