హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సమకూర్చుకొని ఖర్చు పెట్టిన నిధులు రూ.1.90 లక్షల కోట్లు కాగా, కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులు కేవలం రూ.5 వేల కోట్ల లోపేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? అని ప్రశ్నించారు. రాష్ర్టానికి కేంద్రం సహకారంపై అందరకీ అయోమయంగానే ఉన్నదన్నారు. ‘ఒక సీఎంగా ఈ రోజు అధికారికంగా చెప్తున్నా. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొని ఖర్చుపెట్టిన నిధులు సుమారుగా రూ.1.90 లక్షల కోట్లు.
కేంద్రం నుంచి ఏమై నా వస్తయా అంటే ఏం వచ్చేవి లేవు? ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఉపాధిహామీ ఇట్లాంటి వాటిల్లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని కొన్ని ఉంటాయి. రాష్ట్రం రూ.1.90 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో కేంద్ర పథకాల కింద వచ్చిన మొత్తం నిధులు రూ.5 వేల కోట్లు కూడా లేవు. నమ్ముతరా? కానీ వీళ్లు ఏం చెప్తరు? ఏం దుర్మార్గమైన ప్రచారం చేస్తరు? ఇదేనా నీతి ఆయోగ్? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? రాష్ట్రం ఇచ్చే ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేస్తున్నారు. కేంద్రానికి పంపే ప్రతి ప్రతిపాదన నీతి ఆయోగ్‌కు కూడా పంపిస్తున్నాం. వాళ్లనేమైనా అడుగుతరేమోనని. కానీ వాళ్లను ఎవడూ కేర్ చేసినట్టు లేదు’ అని వ్యాఖ్యానించారు.