హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్‌శక్తి శాఖ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ)లో మరోసారి సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అనుమతులపై చర్చించనున్నారు. 24న ఢిల్లీలో ఈ సమావేశం జరగనున్నది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర నదీ జల విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ అండ్ ఎస్టిమేషన్, భూగర్భ జల, పర్యావరణ, కాలుష్య నియంత్రణ, అటవీ శాఖలు కలిపి మొత్తంగా 18 డైరెక్టరీల నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే టెక్నికల్ అప్రైజల్ కమిటీ తుది అనుమతులను మంజూరు చేస్తుంది.
టీఏసీ అనేది కేవలం లాంఛనమే. ఇదిలావుంటే సమీకృత సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌ను 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించింది. అన్ని డైరెక్టరీల నుంచి అనుమతులను సాధించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ రివర్ బోర్డుల గెజిట్‌లోని ఫ్లో చార్ట్‌ను అనుసరించి ప్రాజెక్టు డీపీఆర్‌ను జీఆర్ఎంబీకి నిరుడు ఏప్రిల్‌లో పంపించింది. బోర్డు సైతం అదే ఏడాది మే నెలలో సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ర్టాల అభిప్రాయాలతో తిరిగి కేంద్రానికి నివేదించింది. అయితే నాటి నుంచి టీఏసీ సమావేశాన్ని నిర్వహించకపోవడంతో తుది అనుమతుల మంజూరు పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో అప్రైజల్ కమిటీ 157వ సమావేశాన్ని ఢిల్లీలో గత ఫిబ్రవరిలో నిర్వహించారు.
సీతారామ ప్రాజెక్టు అనుమతులపై కమిటీ మెంబర్లు, అన్నివిభాగాల డైరెక్టర్లు చర్చించారు. అయితే మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు ఘటనను సాకుగా చూపి ప్రాజెక్టు అనుమతులను టీఏసీ తిరస్కరించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బరాజ్ డిజైన్లను పరిశీలించాలని సీడబ్ల్యూసీ సూచించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్) రూపొందించి, సమర్పించిన డిజైన్లను పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
భూకంపన పరీక్షలతోపాటు, పలు సాంకేతిక పరీక్షలను నిర్వహించి ఆ నివేదికలను సమర్పించాలని షరతులు విధించింది. అయితే ఇటీవల టీఏసీ సూచనల మేరకు అందుకు సంబంధించిన నివేదికలను సీడబ్ల్యూసీకి తెలంగాణ సమర్పించింది. డిజైన్లను సైతం సీడబ్ల్యూసీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీతారామ ప్రాజెక్టు అనుమతుల మంజూరు అంశాన్ని మరోసారి టీఏసీకి ప్రతిపాదించారు. 24వ తేదీన ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు టీఏసీ 158వ సమావేశం కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రాజెక్టుకు తుది అనుమతులు రావడం లాంఛనమేనని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.