హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ‘మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
‘ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తామని చెప్పింది. కానీ, తెలంగాణ నుంచి కరీంనగర్, ఖమ్మం జిల్లాలను ప్రతిపాదించారు. అక్కడ అప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఏమున్నదో కూడా సీఎం కేసీఆర్‌కు తెలియదా?’ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందనగా ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌లో చేసిన అడ్డగోలు వ్యాఖ్య ఇది.
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ర్టాలకు మంజూరు చేసిన కాలేజీలను గమనిస్తే.. నిర్మల వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని, కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయలేదని స్పష్టమవుతున్నది. ఇందుకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశే ప్రత్యక్ష ఉదాహరణ. సీఎస్ఎస్ మూడో దశ కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఈ మూడు కాలేజీల ఏర్పాటుకు 2020లోనే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఉత్తర ప్రత్యుత్తరాల అనంతరం 2020 మార్చిలో పాడేరు (విశాఖపట్నం), గురజాల (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా)లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అంగీకరించింది. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ 2021 డిసెంబర్ 15న రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏపీలో పాడేరు (విశాఖపట్నం), పిడిగురాళ్ల (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా)లో సీఎస్ఎస్ కింద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంగా చెప్పారు.
తెలంగాణపై ఎందుకు కక్ష?
సీఎస్ఎస్ కింద తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలోనే కోరింది. కానీ, కేంద్రం పట్టించుకోలేదు. ఈ విషయంపై 2015లో నాటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. మొదటి విడత జాబితాలో తెలంగాణ పేరులేదని చెప్పారు. రెండో విడతలోనూ అదే అన్యాయం జరిగింది. దీంతో సీఎం కేసీఆర్ సొంతగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ప్రభుత్వం మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ 2019 ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మొదటి రెండో దశలో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవమే అని ఒప్పుకుంటూ.. మూడో దఫా కోసం దరఖాస్తు చేయాలని సూచించారు. అప్పటికే తెలంగాణలో కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చాయి.
నిబంధనలకు అనుగుణంగా.. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఐదు మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలు, కొత్తగా ఏర్పాటు చేసుకున్న మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలు, జిల్లా దవాఖానలు మనుగడలో ఉన్న జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి కరీంనగర్, ఖమ్మం ఉత్తమంగా కనిపించాయి. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరాల్లో కరీంనగర్ ఒకటి. అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని భావించింది.
ఖమ్మంలో మెడికల్ కాలేజీతో మారుమూలన ఉన్న గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే కారణంతో ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేసింది. కానీ, కేంద్రం అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న కారణంతో ప్రతిపాదనలు తిరస్కరించింది. ఇవే నిబంధనలు ఏపీకి మాత్రం వర్తించలేదు. కనీసం క్యాబినెట్ అప్రూవల్ లేని కొత్త జిల్లాలకు కాలేజీలను మంజూరు చేసింది. ఇది తెలంగాణపై కచ్చితంగా వివక్ష చూపడమే.
కేంద్రం ఉల్లంఘన 1
ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నచోట సీఎస్ఎస్ కాలేజీలు ఇవ్వాలని కేంద్రం నిబంధనల్లో ఉన్నది. రాజ్యసభలో కేంద్రం సమాధానం చెప్పేనాటికి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడలేదు. 2022 జనవరి 25న ఏపీ క్యాబినెట్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2022 ఏప్రిల్ 4వ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చాయి. విశాఖపట్నం జిల్లాలో అప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, ప్రైవేట్ ఆధ్వర్యంలో గాయత్రీ విద్యాపరిషత్తు, గీతం, ఎన్నారై వంటి అనేక కాలేజీలు నడుస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీతోపాటు ఎన్నారై, క్రాంతి తదితర మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ ఆధ్వర్యంలో ఐదారు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న చోటికి సీఎస్ఎస్ కింద మెడికల్ కాలేజీ మంజూరు చేసింది.
ఉల్లంఘన 2
కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే చోట కచ్చితంగా జిల్లా దవాఖాన ఉండాలని కేంద్రం నిబంధనల్లో ఉన్నది. ఏపీకి మూడు కాలేజీలు మంజూరు చేసేనాటికి అక్కడ జిల్లాలుగానీ.. జిల్లా దవాఖానలు గానీ మనుగడలో లేవు.