హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : వరదల కారణంగా కొట్టుకుపోయిన రోడ్ల పునరుద్ధరణకు నిధుల కొరత వెంటాడుతున్నది. తక్షణ మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొన్నదని అధికారవర్గాలు వాపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయం అందేవరకు శాశ్వత పునరుద్ధరణ చేపట్టే అవకాశం లేదని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో హామీలను నెరవేర్చేందుకు అప్పులపైనే ఆధార పడుతుండగా, అత్యవసర పనులకు కూడా నిధులు వెచ్చించలేని దీనస్థితి. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా భారీ వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. వర్షాలతో భారీగా నష్టం వాటిల్లిన వాటిలో రోడ్లు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. సుమారు 2,300 కిలోమీటర్ల మేర రోడ్లు రవాణాకు వీలులేకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. చెరువుకట్టలు తెగిన ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టం తీవ్రంగా జరిగింది.
రెండుచోట్ల వంతెనలు కొట్టుకుపోగా, పలుప్రాంతాల్లో వంతెనల అప్రోచ్‌లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. వరదల నష్టాన్ని పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనున్నది. రోడ్ల నష్టం సుమారు రూ.2వేల కోట్లకు పైగానే ఉందని నిర్ధారించిన ఆర్అండ్బీ శాఖ.. ప్రభుత్వం ద్వారా నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది. తక్షణ మరమ్మతుల కోసం కనీసం రూ.300 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ముఖ్యంగా జిల్లా, మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్లు కంకరతేలి ప్రయాణం సాగించలేని స్థితికి చేరాయి. వీటి మరమ్మతులకు సుమారు రూ.1000 కోట్లు అవసరమవుతాయని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు కూడా దాదాపు రూ.1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. దీంతో కొత్తగా రోడ్ల మరమ్మతు పనులకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు.