జనగామ, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రెండు పథకాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ పథకం ప్రారంభోత్సవాన్ని శనివారం జనగామలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, జిల్లా అధికారులతో కలిసి ఆయన వీక్షించారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఈ పథకానికి రూ. 24 వేల కోట్లు కేటాయించినట్టు చెబుతున్నారని పేర్కొన్నారు. కొత్తవి తీసుకురాకుండా ఇప్పటికే ఉన్న పథకాల నిధులు కలిపి చూపిస్తున్నారని తెలిపారు. పీఎం కిసాన్ యోజన పేరుతో ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతున్నా, వాస్తవంగా రైతుల జీవితాల్లో మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా రైతుల కోసం తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం ప్రారంభించి 72 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదని గుర్తుచేశారు. కలెక్టర్ షేక్రిజ్వాన్బాషా మాట్లాడుతూ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి ఎంపికైన జిల్లాలో జనగామ ఒకటని తెలిపారు.