హైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ భవన్లో శుక్రవారం ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు.
కృష్ణయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ పార్లమెంట్లో బిల్లును పెట్టాలని, లేకుంటే దేశంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
బీసీల అభివృద్ధి, హకుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, గోరిగె మల్లేశ్‌యాదవ్, గవ్వల భరత్, గుజ్జ సత్యం, లాల్‌కృష్ణ, నీల వెంకటేశ్, నంద గోపాల్, రాజేందర్, అనంతయ్య, కృష్ణ, కృష్ణుడు, పృథ్వీగౌడ్, రమాదేవి, లక్ష్మి, నిఖిల్ పాల్గొన్నారు.