హైదరాబాద్‌కు నలువైపులా నాలుగు అత్యాధునిక దవాఖానలు, ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరుచేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ దవాఖానల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. పేద రోగుల కోసం ఉచితంగా డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటుచేశాం. అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరిచాం. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరుచేయలేదు. దీనిపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)/హుస్నాబాద్ టౌన్: రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధుల కంటే రాష్ట్రానికి కేంద్రం ఒక్కపైసా అదనంగా ఇవ్వలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. రావాల్సిన వాటికంటే ఎన్ని నిధులు కేంద్రం ఎక్కువగా ఇచ్చిందో బండి సంజయ్ చెప్పాలని సవాల్ విసిరారు. బండి పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందనలేదని తెలిపారు. హుస్నాబాద్ సభలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్య, వైద్యం ప్రాధాన్యాన్ని ఎప్పుడో గుర్తించారని, అందులో భాగంగానే జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు నలువైపులా నాలుగు అత్యాధునిక దవాఖానలు, ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీని మంజూరుచేశారని పేర్కొన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ దవాఖానల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పేద రోగుల కోసం ఉచితంగా డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటుచేశామని, అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపర్చామని చెప్పారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరుచేయలేదని.. దీనిపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని అన్నారు. అనేక పోరాటాల తర్వాత ఒక్క ఎయిమ్స్‌ను మంజూరుచేసి చేతులు దులుపుకొన్నదని చెప్పారు.
నవోదయ, కేవీలు ఎక్కడ?
నిబంధనల ప్రకారం కేంద్రం ప్రతి జిల్లాకు ఒక నవోదయ, ఒక కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉన్నదని, తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఇవ్వలేదని వినోద్‌కుమార్ ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైనవి కూడా అతీగతి లేకుండా పోయాయని చెప్పారు. బీజేపీ నాయకులకు కనీస స్పృహ ఉంటే వాటినైనా మంజూరు చేయించాలని హితవు పలికారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు, వాటిల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నామని, వాటిని ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశామని వివరించారు. విదేశీ విద్యకు రూ.20 లక్షలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరెంటు, తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. మూడేండ్లపాటు కరువొచ్చినా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తామని బండి సంజయ్ పాదయాత్రలో చెప్తున్నారని.. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. అసలు రైతులు, ప్రజలు ఎవరి పనుల్లోవారు బిజీగా ఉన్నారని.. ఎవరూ బండి పాదయాత్రను కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వారికేమన్నా సమస్యలుంటే చెప్పుకోవడానికి వచ్చేవారని.. కానీ ఆ పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదనేది పచ్చి అబద్ధమని.. ఆ పరిస్థితి బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఉన్నదని చెప్పారు.
బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా?
బీజేపీ, కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలున్న విషయాన్ని మరిచిపోయి కేంద్రమంత్రి స్మృతిఇరానీ టీఆర్ఎస్ను విమర్శించడాన్ని వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలో తాతలు, తండ్రులు, కొడుకులు రాజకీయాల్లో ఉన్న విషయాన్ని ఆమె మరిచి పోతున్నారని ఎద్దేవాచేశారు. లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీసభ్యులు ఎందరు రాజకీయ వారసులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. సమావేశాల్లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్దే
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్దే విజయమని వినోద్‌కుమార్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఉద్యమ నాయకుడని, బడుగువర్గాల నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పారు. సీఎం కేసీఆర్ బహిరంగసభను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేశామని, కమిషన్ నిర్ణయం ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు.