హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా లొంగకపోవటంతో రాష్ట్ర ఆర్థిక మూలలపై దెబ్బకొట్టేలా మోదీ సర్కారు పావులు కదుపుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్టానికి రాజ్యాంగబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా, అవసరాల కోసం రుణాలు తీసుకోకుండా సవాలక్ష ఆంక్షలు విధించి వేధిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు నిధులు కేటాయించాలని ఆర్థిక సంఘం, నీతి అయోగ్ చేసిన, చేస్తున్న సిఫారసులను బుట్టదాఖలు చేస్తూ తీవ్ర వివక్ష చూపుతున్నదని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి సాధిస్తుండటంతో బీజేపీ పెద్దలు కక్షగట్టి కష్టాలపాలు చేస్తున్నారని అంటున్నారు.
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఉన్నది కేంద్రం తీరు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపాయి కూడా అదనంగా ఇచ్చే మనుసు లేకపోగా.. రాష్ట్రం సొంతంగా అప్పులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవడాన్ని కూడా అడ్డుకొంటున్నది. బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రప్రభుత్వం అప్పులు తీసుకోవటంపై ఆంక్షలు పెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్పొరేషన్లు తీసుకొన్న రుణాలను కూడా ప్రభుత్వ అప్పుల్లో జమచేసి ఎఫ్ఆర్బీఎంపై ఆంక్షలు విధించింది. రుణాలు తీర్చే సత్తా ఉన్నది కాబట్టే తెలంగాణ రాష్ట్రం రుణాలు తీసుకొంటున్నదని పలుమార్లు కేంద్రమే చెప్పింది. దేశంలో తక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అని పార్లమెంట్లోనూ ప్రకటించింది. లోలోపల మాత్రం రాజకీయ లబ్ధి కోసం రుణాలు దక్కకుండా కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ మాట వినే రాష్ర్టాలకు ఇబ్బడి ముబ్బడిగా అప్పులకు అనుమతిస్తుండటం గమనార్హం. మరోవైపు కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిల చిట్టా పెరిగిపోతున్నది. ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ సిఫారసులు, జీఎస్టీ బకాయిలు తదితర పద్దులు కలిపితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్లకు పైగానే ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.