హైదరాబాద్, మార్చి 14, (నమస్తే తెలంగాణ)ః ఎందుకో.. ఏమో కానీ.. ఢిల్లీలో మోదీ సర్కారుకు తెలంగాణ అంటే మొదట్నుంచీ చులకనభావమే. తెలంగాణ అన్న రాష్ట్రం ఒకటి ఉన్నదన్న లెక్క కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించదు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కూడా తెలంగాణను కానీ, ఇక్కడి ప్రజలను కానీ, ప్రభుత్వాన్ని కానీ పట్టించుకొనే పాపాన పోలేదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపేసింది మొదలు.. నిన్నటికి నిన్న అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించుకొనిపోవడం వరకు కండ్ల ముందు కనిపించే ఉదంతాలు కోకొల్లలు. గుజరాత్లో వరదలు వస్తే.. ఉదారంగా రూ.వెయ్యి కోట్లు ఇస్తారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే.. పైసా విదిల్చరు సరికదా.. పోచికోలు ముచ్చట్లు చెప్తారు. రాష్ర్టానికి ఇవ్వాల్సిన గ్రాంట్ల విషయంలోనూ కేంద్రం వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకోసం అన్ని రాష్ర్టాల మాదిరిగానే మన రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని ఆశిస్తుంది. కానీ.. ఇతర రాష్ర్టాలకు ఇతోధికంగా సహాయమందిస్తున్న కేంద్రం తెలంగాణకు మాత్రం చిల్లిగవ్వ ఇవ్వటంలేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఏడాదికి గరిష్ఠంగా రూ.15,450 కోట్లు మాత్రమే అందాయి.
ఆర్థిక సంవత్సరం 2021-22లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.38,669 కోట్లు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాలను రూ.28,669 కోట్లుగా సవరించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి కూడా కేంద్రం నుంచి అందిన నిధులు రూ.7,303 కోట్లు మాత్రమే. రాష్ట్రం ఆశించిన ఆర్థిక సహాయంలో ఇది నాలుగోవంతు మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో కేంద్రం నుంచి రూ.41,001 కోట్లు అందుతాయని అంచనా వేసింది. ఇందులో కేంద్ర పథకాల ద్వారా రూ.9,443 కోట్లు, జీఎస్టీ అమలు తర్వాత రాష్ర్టానికి తగ్గిన రాబడికి పరిహారంగా రూ.3,000 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి రావాల్సిన మొత్తం రూ.900 కోట్లు. ఇవేకాకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకు నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.25,555 కోట్లు రావాలని ప్రతి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23లో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొత్తంగా కలిపి రూ.59,396 కోట్లుగా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో పన్నుల వాటా రూ.18,394 కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణకు రూ.3,003 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.9,443 కోట్లు అందుతాయని అంచనా వేసింది. రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి కేంద్రం నుంచి అందిన నిధులను విశ్లేషిస్తే రాష్ట్రం అశించిన మేరకు కేంద్రం నుంచి నిధులు అందుతాయన్న నమ్మకం ఏ కోశానా కనిపించడం లేదు.