హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లుతుంటే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వర్షాలు కురిసినప్పుడు స్పందించిన కేంద్రం తెలంగాణ విషయంలో నిర్లప్తంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా గత 20 రోజుల నుంచి అకాల వర్షాలు, వడగండ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నీళ్లపాలవుతున్నాయి. లక్షల ఎకరాల్లో వరి, మక్కజొన్న, మామిడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రధాని మోదీలో చలనం లేదు. జరిగిన నష్టంపై కనీసం ఆరా తీసిన పాపాన పోలేదు. రాష్ట్ర బీజేపీ నేతలదీ అదే తీరు. కేంద్రం నుంచి సాయం రాబట్టేందుకు ప్రయత్నించకపోగా బురద రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు పంటనష్టంపై కేంద్రానికి నివేదించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులపై కేంద్రం అంతులేని వివక్ష చూపిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వమే వారిని అక్కున చేర్చుకున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం ప్రకటించారు. ఇందుకోసం రూ.151 కోట్లు విడుదల చేశారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం సర్వేలు కొనసాగుతున్నాయి. అధికారులిచ్చే నివేదికల ఆధారంగా నష్టపోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం అందించేలా కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు.