హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారులు అధికంగా ఉన్నప్పటికీ.. చేపల వినియోగంపై అవగాహన లేకపోవడంతో తక్కువగా వినియోగిస్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనం పలు అంశాలను తెలిపింది. రాష్ట్ర జనాభాలో 90శాతం మంది మాంసాహారులైనప్పటికీ, వారిలో ఎకువమంది మటన్, చికెన్ గుడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో అత్యధిక పోషక విలువలున్న చేపలను ఆహారంగా తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జాతీయ మత్స్యశాఖ తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా జనాభాలో 72.1శాతం మంది చేపలను ఆహారంగా తీసుకుంటుండగా, తెలంగాణలో 58శాతం మాత్రమే వినియోగిస్తున్నారు. దేశంలో చేపల తలసరి వినియోగం సగటున 13.1 కిలోలు కాగా, తెలంగాణలో 8.37 కిలోలుగా ఉన్నది. త్రిపుర, కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో వినియోగం అధికంగా ఉండగా.. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల తలసరి వినియోగం తకువగా ఉన్నట్టు వెల్లడించింది.
దేశంలో ఏడాదికి 4,77,283 టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. వినియోగంలో మాత్రం 14వ స్థానంలో ఉన్నది. దేశంలో ఏడాదికి 175.45 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఐదేండ్ల కిందట 8.9 కిలోలుగా ఉన్న తలసరి వినియోగం ప్రస్తుతం 13.1 కిలోలకు చేరింది. రాష్ట్రంలో గత ఏడాది తలసరి వినియోగం 7.96 కిలోల నుంచి తాజాగా 8.37కి పెరిగింది. దేశంలో అత్యధికంగా 27.62 కిలోల తలసరి వినియోగంతో త్రిపుర మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కర్ణాకట(20.72 కిలోలు), మూడో స్థానంలో కేరళ(20.65 కిలోలు)ఉన్నది. ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో( 9.93 కిలోలు), తెలంగాణ 14వ స్థానంలో(8.37 కిలోలు) ఉన్నది. ఇక రోజూ చేపలు తినే వారిలో కేరళ (53.5%), గోవా(36.2%) రాష్ట్రాల ప్రజలు ఎకువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం టెండ ర్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 12న ముగిసింది. దీంతో గుత్తేదారుల ఖరారు కోసం అధికారులు టెండర్లను పరిశీలిస్తున్నారు. వాస్తవంగా సెప్టెంబర్ మొదటి వారంలోనే చేప పిల్లల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉ న్నప్పటికీ, టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. గత రెండేండ్లు చేపపిల్లలను సరఫరా చేసిన గుత్తేదార్లకు నిధులు చెల్లించకపోవడంతో వారు ఈ ఏడాది టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో మూడు పర్యాయాలు టెండర్ల గడువును పెంచాల్సి వచ్చింది.
ఎ ట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తవగా.. 32 జిల్లాలకు 80 టెండర్లు దాఖలైనట్టు మత్స్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల చివరి వరకు టెండర్ల పరిశీలన పూర్తయితే, అక్టోబర్ రెండో వారం నుంచి చేపపిల్లల పంపి ణీ ప్రారంభించే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. అక్టోబర్లో వదిలితే అన్ని చెరువులు పూర్తయ్యేవరకు 5 రోజుల సమయంపట్టి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని మత్స్యకార సంఘాలు భావిస్తున్నాయి. 2025-26 వార్షిక సంవత్సరానికి రూ.123 కోట్లతో 90 కోట్ల చేప పిల్లలను పంపిణీకి మత్స్యశాఖ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.