Vote Verification | హైదరాబాద్, నవంబర్ 21 ( నమస్తే తెలంగాణ) : ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశామనే విషయాన్ని స్పష్టంగా చూసుకోవచ్చు. ఈవీఎంపై వేసిన ఓటు తాము ఎంచుకున్న పార్టీకే పడిందనే విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ వెరిఫెబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ ఈవీఎంపై ఓటు వేసిన తరువాత వీవీ ప్యాట్‌లో తాను వేసిన ఓటు ముద్రించి ఓటరుకు కనిపిస్తుంది. ఇలా ఏడు సెకండ్ల పాటు కనిపించే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతో ఓటర్లకు ఎలాంటి అనుమానాలు, అపోహాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈసీఐఎల్ రూపొందించిన ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓటు వేయడానికి సగటు 21 సెకన్లకు పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. ఇందులో ఓటు వేసిన తరువాత ఆ ఓటు ప్రింట్ అయి వీవీ ప్యాట్‌లో 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దీంతో సగటున 21 సెకన్ల పైగా సమయం ఓటింగ్‌కు పడుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లలో 1550 మంది ఓటర్లు హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో 1500 ఓటర్లు ఉండే విధంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
పోలింగ్ జరిగే 10 గంటల్లో గరిష్ఠంగా 1700 ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా లెక్కలు వేసి ఓటర్లకు పోలింగ్ కేంద్రాలను నిర్ణయించారు. గతంలో వీవీ ప్యాట్లు లేని సమయంలో ఇంకా తక్కువ సమయం పట్టేది. కానీ వీవీ ప్యాట్లు రావడంతో మరో ఏడు సెకండ్లు అదనపు సమయం పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఓటర్లు ఎలాంటి అనుమానాలు, అపోహాలు లేకుండా వీవీ ప్యాట్లను ఉపయోగపడుతున్నాయి. వీవీ ప్యాట్ ఓట్లను లెక్కించరు. ఈవీఎం ఓట్లను మాత్రమే లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ల ఓటు సమానంగా ఉన్నాయా లేదా అని చూపించడానికి ఐదు పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. దీంతో అభ్యర్థి, ప్రజలకు ఉన్న అపోహాలు, అనుమానాలు నివృత్తి చేస్తారు.