హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఏడేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అనూహ్య వృద్ధిని సాధించిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇదే సమయంలో బీజేపీ పాలనలో దేశాభివృద్ధి కుంటుపడిందదన్నారు. ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కన్నా బలహీనంగా తయారైందని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పురోగమిస్తే.. బీజేపీ పాలనలో దేశం తిరోగమించిందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ప్రతిపక్షాలు అనవసర విమర్శలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రం గత ఏడేండ్లలో ఆర్థికంగా సాధించిన ప్రగతిని వివరించారు. 2019-20లో భారత వృద్ధిరేటు 2.5 శాతంగా ఉంటే బంగ్లాదేశ్‌లో 8.1 శాతంగా ఉన్నదని పేర్కొన్నారు. తలసరి ఆదాయం మన దగ్గర 18,077 డాలర్లు కాగా, బంగ్లాదేశ్‌లో మనకన్నా 10 డాలర్లు ఎక్కువగా 18,087 డాలర్లు ఉన్నదని వివరించారు. ఇదేనా బీజేపీ సాధించిన వృద్ధి అని ప్రశ్నించారు. తెలంగాణ ఏడేండ్లలో తలసరి ఆదాయంలో పదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎదిగిందని, పలురంగాల్లో టాప్‌లో ఉన్నదన్నారు. అన్ని రంగాల్లో జాతీయ సగటును మించి వృద్ధి నమోదుచేసిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా దేశాన్ని సాకుతున్న నాలుగైదు పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని గణాంకాలు నిరూపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చేది తక్కువని, దేశానికి తెలంగాణ ఇస్తున్నదని ఎక్కువన్నారు. ఈ లెక్కలు కేంద్రం స్వయంగా విడుదలచేసిన గణాంకాలన్నారు. కిషన్‌రెడ్డి రాష్ర్టానికి రావాల్సినవి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యాయో చెప్పాలని, ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారో చెప్పి, దానిని పునరుద్ధరించడం గురించి మాట్లాడాలని హితవు పలికారు.
మీది నెగెటివ్ వృద్ధి
దేశాన్ని వృద్ధి చేశామని బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారని, ఏ రంగంలో వృద్ధి చేశారో కనీసం ఒక్కటైనా చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో గణనీయమైన వృద్ధిని సాధించారని ఎద్దేవాచేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.57 ఉంటే ఇప్పుడు పెట్రోల్ ధర రూ.105, డీజిల్ ధర రూ.97కు పెరిగిందని గుర్తుచేశారు. పెట్రోల్ ధరల్లో 46 శాతం. డీజిల్ ధరల్లో 70 శాతం వృద్ధిని సాధించారని చురకలు అంటించారు. సెస్ రూపంలో పెట్రోల్, డీజిల్‌పై ఒక లీటర్‌కు అదనంగా రూ.16 భారం వేశారని తెలిపారు. ఈ పెంపుతో రవాణావ్యయం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశానికి తాకాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచి పేదల నడ్డి విరచడంలో రెట్టింపు వృద్ధి సాధించారని తెలిపారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.450 ఉంటే ఇప్పుడు రెట్టింపు అయ్యిందన్నారు. గ్యాస్ సబ్సిడీలో మైనస్ వృద్ధి కూడా సాధించారని ఎద్దేవాచేశారు. గతంలో ఒక్కో సిలిండర్‌కు రూ.250 రాయితీని బ్యాంకుల్లో జమ చేశారని, ఇప్పుడు రూ.40కి తగ్గించారని అన్నారు. సిలిండర్ ధర పెంచి, సబ్సిడీ తగ్గించడం వృద్ధి సాధించడమా? అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటేయాలని బీజేపీ చెప్పిందని.. ఇప్పుడు దేనికి దండం పెట్టాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై పన్నులను ఒక్కసారే పెంచిందని, కేంద్రం మాత్రం 26 సార్లు పెంచిందని గుర్తుచేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను పెట్టమంటే పట్టించుకోలేదని, కానీ పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిని పెట్టారన్నారు. రోడ్లను, విమానాశ్రయాలను, నవరత్నాలను, ఎల్ఐసీలను అమ్ముతున్నారని విమర్శించారు. పైగా రాష్ర్టాలను కూడా అస్తులను అమ్మాలని ప్రోత్సహిస్తున్నారని, ముందుగా అమ్మినవారికి రూ.6 వేల కోట్ల వరకు బహుమతి ఆఫర్ ఇస్తున్నారని చెప్పారు. దేశంలో జీడీపీ మైనస్‌లోకి వెళ్లిందని, తలసరి ఆదాయం, ఆదాయ వృద్ధిలో బలహీనంగా ఉన్నామన్నారు. సొంత రాబడుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఏటా 11.52 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు. గుజరాత్ కేవలం 2.59 శాతంతో 18వ స్థానంలో ఉన్నదని అన్నారు. ఇదేనా బీజేపీ పాలనలో సాధించిన వృద్ధి అని మండిపడ్డారు.
రెండోస్థానం కోసమే ప్రతిపక్షాల కొట్లాట
రాష్ట్రంలో ప్రతిపక్షాలు రెండో స్థానం కోసమే కొట్లాడుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం, టీఆర్ఎస్ ఉన్నంతకాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ మొదటి స్థానంలోనే ఉంటుందని, అధికారంలో ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండోస్థానం కోసమే కొట్లాడుతున్నాయని చెప్పారు. ఆరేడేండ్లుగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేకపోవడం ప్రతిపక్షాలకు పెద్ద సమస్యగా మారిందన్నారు. గతంలో అసెంబ్లీకి మొదటిరోజు ఖాళీ బిందెలు, క్యాండిల్, ఎండిపోయిన వరి, ఎండిన మక్క కంకులు పట్టుకొని వచ్చేవారని గుర్తుచేశారు. ఇప్పుడా పరిస్థితి లేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారని చెప్పారు. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సాగునీటి సమస్యకు, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో కరంటు సమస్యకు పరిష్కారం చూపామని తెలిపారు. ఒకప్పుడు పవర్ హాలిడేలు విధించి పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన చరిత్ర కాంగ్రెస్‌దైతే.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. వైద్య రంగంలోనూ మంచి వృద్ధి సాధించామన్నారు. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి సమస్యలు దొరుకక, ఇష్టమొచ్చినట్టు నిరాధార విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్ర పౌరులుగా పరువు తీయొద్దు
రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్న వేళ ప్రతిపక్ష నేతలు రాష్ట్ర పౌరులుగా సానుకూలంగా మాట్లాడాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రభుత్వ పనులను మెచ్చుకోకపోయినా.. టీఆర్ఎస్పై విమర్శలు చేయబోయి రాష్ర్టాన్ని అభాసుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనవసర విమర్శలతో ప్రజల ముందు చులకనవుతున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరథలో, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇందుకు సమాధానమిచ్చిందని, పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులే ఈ ఆరోపణలను ఖండించారని గుర్తుచేశారు. మిషన్ భగీరథలో అవినీతి లేదని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే రాష్టం తెలంగాణ అని అభినందిస్తూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్లో చెప్పారని గుర్తుచేశారు. వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్న వీరిని ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
అభిప్రాయాన్ని మార్చేశాం
సంక్షేమానికి ఎకువ నిధులు ఖర్చు చేస్తే ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందనే అభిప్రాయం ప్రచారంలో ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో సింహభాగం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ కూడా, ఆర్థికాభివృద్ధిలోనూ ముం దంజ వేయడం ద్వారా ఈ అభిప్రాయం నిజం కాదని చాటిచెప్పామన్నారు. ఇంతటి ఆర్థికాభివృద్ధి ఏదో మంత్రం వేస్తేనో, మాయ చేస్తేనో సాధ్యం కాలేదని, రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఒకనాడు కరవు కాటకాలకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోను సాధించిన అపూర్వమైన ప్రగతి వల్ల ఈ రోజు వ్యవసాయ రంగం రాష్ట్ర ఆదాయాన్ని పెంచే గ్రోత్‌ఇంజిన్‌గా మారిందని చెప్పారు.
అన్ని కుటుంబాలకు దళితబంధు
రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందుతుందని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలను దళిత కుటుంబాలు ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెడుతాయి. తద్వారా వారికి స్వయం ఉపాధి లభిస్తుంది. వారికి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మరోవైపు ఆయా రంగాల్లో వారుచేసే ఉత్పత్తులు రాష్ట్ర సంపదలో, జీఎస్డీపీ వృద్ధిలో భాగమవుతాయి. అంతిమంగా వారు రాష్ర్టాభివృద్ధిలో భాగమవుతారు’ అని వివరించారు. వారికి డబ్బు ఎలా ఇస్తారనే అనుమానాలు వద్దని హితవుచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ రిజర్వాయర్ మొదలుపెట్టినప్పుడు సైతం ఇవే ప్రతిపక్షాలు ఇలాంటి అనుమానాలే లేవనెత్తాయన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పొలాలకు పారుతున్నాయని, మల్లన్న సాగర్ కూడా పూర్తయిందని చెప్పారు. దళితబందు అమలులో సీఎం కేసీఆర్‌కు ఒక ఆలోచన ఉన్నదని, కచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని దళిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందుతుందని స్పష్టం చేశారు. నిరర్ధక ఆస్తులను పెట్టుకొని కూర్చోవడం కంటే మన ఉత్పత్తులు పెంచుకోవడానికి పేదలకు సహాయం చేయడానికి, ఉపాధి కల్పన పెరుగడానికి, రాష్ట్ర సంపదను పెంచి, దానిని పేదలకు పంచేందుకు వినియోగించాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని అన్నారు.
మీ రాష్ర్టాల్లో ఉన్నాయా?
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుత విజయాన్ని సాధించాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రస్తుతం తెలంగాణ పలెల్లో కనిపిస్తున్నదని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో 18 బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో 5 రాష్ర్టాలు ఉన్నాయని, వీటితోపాటు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ మాదిరి అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు.
తుదిదశలో ఉద్యోగ ఖాళీల నివేదిక
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల నివేదిక తుది దశకు చేరిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇటీవలే కొత్త జిల్లాల ఏర్పాటు, నూతన జోనల్ విధానంపై రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని గుర్తు చేశారు. దీని ప్రకారం జిల్లా పోస్టుల్లో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను నూతన జిల్లాల ఆధారంగా విభజించాల్సి ఉన్నదని చెప్పారు. అప్పుడే జిల్లాలవారీగా ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల విభజన జరుగుతున్నదని, ఖాళీలపై త్వరలోనే నివేదికను సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర క్యాబినెట్‌కు సమర్పిస్తామని చెప్పారు.
ప్రతిపక్షాలది గోబెల్స్ ప్రచారం
సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకొన్న చర్యలు, సమర్థమైన ఆర్థిక ప్రణాళికల ఫలితంగా రాష్ట్ర జీఎస్డీపీ ఏడేండ్లలోనే రెట్టింపు అయ్యిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇది ఒక అపూర్వమైన విజయమని, నిజాలు ఇలా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రం దివాళా తీసిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏడేండ్లలో రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల 93.8 శాతంగా ఉంటే, దేశ జీడీపీ పెరుగుదల కేవలం 58.4 శాతం మాత్రమే ఉన్నదని, దీనిని బట్టే ఎవరు వృద్ధి సాధించారో, ఎవరు సాధించలేక చతికిలపడ్డారో చెప్పాలన్నారు.
విద్యుత్ చట్టంతో రైతులకు తిప్పలు
కేంద్రం తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబండగా మారుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విద్యుత్తు చట్టం ప్రకారం విద్యుత్ వినియోగంపై ఎనర్జీ ఆడిటింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు మీటర్ బిగించి, రైతులు ఎంతమేర వాడుకున్నారో లెక్కించాల్సి వస్తుందన్నారు. గతంలో సిలిండర్లకు రాయితీ ఇవ్వకుండా ఆ మొత్తాన్ని నేరుగా ఖాతాలో వేస్తామని చెప్పారని, తర్వాత సబ్సిడీ తగ్గించారని గుర్తుచేశారు. అదేవిధంగా రైతులు వాడుకున్న మేర బిల్లు కట్టించుకొని, ఆ మొత్తాన్ని అకౌంట్లో వేస్తామని చెప్పి.. రానురాను సబ్సిడీలు ఎత్తివేసే ప్రమాదం ఉన్నదన్నారు. అందుకే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు.