హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు దాదాపు లక్ష మందికిపైగా పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ రవిగుప్తా శనివారం వెల్లడించారు. 73,414 మంది సివిల్ పోలీసులు, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగాలకు చెందిన 500 మంది సిబ్బందితోపాటు 164 కంపెనీల సెంట్రల్ ఆర్డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్డ్ కంపెనీలు, ఇతర శాఖలకు చెందిన 2,088 మంది సిబ్బం ది, ఇతర రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది హోంగార్డులను వినియోగిస్తున్నట్టు వివరించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 16 నుంచి మే 10వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 482 ఫ్లయింగ్ స్కాడ్స్, 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, 89 ఇంటర్ స్టేట్ బో ర్డర్ చెక్‌పోస్టులు, 173 జిల్లా చెక్‌పోస్టుల ద్వా రా విస్తృతంగా తనిఖీలు చేపట్టి రూ.186.14 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడంతోపాటు తెలంగాణ ఎక్సైజ్, ఎన్డీపీఎస్, ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టాల కింద మొత్తం 8,863 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపారు. వివిధ నేరాల్లో భాగస్వాములైన 34,526 మందిని బైండోవర్ చేసినట్టు చెప్పారు.
డీజీపీ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్
ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డీజీపీ ఆఫీసులో ప్రత్యేకంగా సెంట్రల్ కంట్రోల్ రూమ్‌తోపాటు పోలీసు లు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి చివరి ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌లో సురక్షితంగా భద్రపరిచే వరకూ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నట్టు చెప్పారు.
మార్చి 16 నుంచి మే 10 వరకు స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు
సొత్తు : విలువ (రూ.)
నగదు : 93,94,43,358
మద్యం : 10,07,49,567
డ్రగ్స్ : 7,86,32,020
ఆభరణాలు : 62,77,77,480
ఇతర తాయిలాలు : 11,48,88,459
మొత్తం : 186,14,90,884