హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : అమాయకులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది. ‘ఆపరేషన్ చక్ర-3’లో భాగంగా గురువారం నుంచి దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని వయాజెక్స్ సొల్యూషన్స్, పుణెలోని వీసీ ఇన్ఫ్రాటెక్, విశాఖపట్నంలోని వీసీ ఇన్ఫ్రాటెక్, అత్రియా గ్లోబల్ సర్వీసెస్ సంస్థల కాల్సెంటర్లలో సోదాలు నిర్వహించి 26 మందిని అరెస్టు చేసిన ట్టు ప్రకటించింది. వీరిలో విశాఖకు చెందిన 11 మంది, పుణెకి చెందిన 10 మంది, హైదరాబాద్కు చెందిన నలుగురు ఉన్నట్టు వెల్లడించింది. రూ.58.45 లక్షల నగదుతోపాటు పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ రికార్డులు, భారీ సంఖ్యలో లాకర్ల తాళాలు, 3 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. సైబర్ నేరగాళ్లు ‘టెక్ సపోర్ట్ సర్వీస్’ల పేరుతో కంపెనీలను ప్రారంభిస్తున్నట్టు సీబీఐ గుర్తించింది. మీ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయని, మీ బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద ఎత్తున అనధికార లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది.