గోదావరిఖని : ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని నరేంద్ర మోదీ(Narendra Modi)కి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కులేదని అన్నారు. నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ గోదావరిఖని(Godavarikhani)లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్పొరేటు(Corporate) శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ శక్తుల చేతులలో బంది చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వమని మండిపడ్డారు. గతంలో గోదావరిఖని పర్యటనకు వచ్చిన సందర్భంగా సింగరేణి బొగ్గు(Singarenei coal mines) బ్లాకులను వేలం వేసే ప్రసక్తే లేదని ప్రకటించిన మోదీ నేడు వేలానికి ఎందుకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం ఎంత మందికి చేశారో చెప్పాలని అన్నారు. నోట్ల రద్దు ద్వారా అవినీతి సొమ్మంతా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి రూ. 15 లక్షలు అకౌంట్ లో వేస్తానన్న మోదీ ఇప్పటికీ ఎంతమంది అకౌంట్లలో రూ. 15 లక్షలు వేశారో వెల్లడించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండ కట్టడానికే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య , వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షరాలు అరుణ జ్యోతి, సీపీఎం పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి,సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, సీనియర్ నాయకులు టి.రాజారెడ్డి, మెండే శ్రీను జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.