నర్సంపేట, మే 21: తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు ముగిసినప్పటికీ, మళ్లీ రెండు నెలలు పొడగించి కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు పంపడం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఛేదిస్తూ అనుభవజ్ఞులైన నిపుణులు రూపొందించిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు, రైతాంగం ముందు ఉంచుతుందని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి చిల్లర చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు.