FASTag | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కేంద్రప్రభుత్వం త్వరలో కొత్త ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. అన్ని రహదారులపై ప్రతిసారీ టోల్‌ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేకుండా ఒకేసారి ఏడాదికి చెల్లించేలా తగు విధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అంతరాయంలేని ప్రయాణాన్ని అందించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
దీనిపై ఇప్పటికే ముసాయిదా రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలో వాహనదారులు రూ.3వేలు చెల్లించి ఏడాదంతా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై అపరిమితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నది. వాహనదారులకు ఈ వార్షిక పాస్‌తో దేశవ్యాప్తంగా ప్రయాణం చేసేందుకు అవకాశం ఇవ్వనున్నది. ప్రస్తుతం రూ.3వేలు వార్షిక ప్లాన్ మాత్రమే కాకుండా, 100 కిలోమీటర్ల దూరానికి రూ.50 చెల్లిస్తే సరిపోయేలా మరో ప్లాన్ సైతం తీసుకరానున్నది.