(స్పెషల్ టాస్క్ బ్యూరో)
G20 summit | హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్ వేల కోట్ల రూపాయల ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2023-24 బడ్జెట్లో జీ20 సమావేశాల కోసమని రూ.990 కోట్లు కేటాయించగా.. చేసిన ఖర్చు మాత్రం రూ.4,100 కోట్లకు పైగా(300 శాతం కంటే ఎక్కువగా) ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఓ వైపు పేదోడు మూడు పూటలా తిండి లేక అల్లాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టిందని, మోదీ సర్కార్ అవనసరపు అర్భాటాలకు పోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీని రంగు రంగుల లైట్లతో అలంకరించారని, భారీగా పెయింటింగ్‌లతో ముంచారని, అతిథులకు బంగారు, వెండి పాత్రలో వంటలు వడ్డించి, రాచ మర్యాదలు చేశారని మండిపడుతున్నారు.
గత ఏడాది ఇండోనేషియాలో జీ20 సమావేశాలు జరుగ్గా.. ఆ దేశం రూ.364 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇది మన దేశంలో మోదీ సర్కార్ పెట్టిన ఖర్చుకు సుదూరమని నెటిజన్లు విమర్శించారు. ఇతర దేశాల నేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరైన సదస్సులో.. మోదీ తన గొప్పలు చాటుకొనేందుకు అనవసర ఆర్భాటం చేశారని ఎత్తిచూపారు. జీ20 సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు పెట్టిన ఖర్చుతో మన దేశం పెట్టిన ఖర్చును పోలుస్తూ మండిపడుతున్నారు.