నిర్మల్ : తెలంగాణ పట్ల కేంద్రం అవలంభిస్తున్న కక్షపూరిత విధానాన్ని విడనాడాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఆధ్వర్యంలో రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్ జయశంకర్ సర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడ అవుతుందని, సీఎం కేసీఆర్ సారధ్యంలో వివిధ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దీనిని జీర్ణించుకోలేక మోదీ ప్రభుత్వానికి కడుపు మంటగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇతర రాష్ట్రాల్లో చేపల ఆరబోతకు కల్లాల నిర్మాణం జరుగుతుంటే తెలంగాణలో రైతులు పంట ఆరబెట్టెందుకు నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వబోమని అనడం తెలంగాణపై వివక్షకు నిదర్శనమని అన్నారు. నిర్మల్ జిల్లాలో రూ. 12 కోట్లతో 19 వేల కల్లాలను నిర్మించుకున్నారని, ఇప్పుడు వాటికి నిధులు ఇవ్వమంటే రైతులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, నాయకులు అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు.