– మళ్లీ కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష
– రైతు సభల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు
కట్టంగూర్, జూలై 01 : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు కేసీఆర్ రూ.10,000 ఇస్తే తాము రూ.15,000 ఇస్తామని, ఆ ముష్టి పది వేలు ఎవరికి కావాలి” అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి లాంటి దేవుళ్ల మీద ఒట్టేసి మరీ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతులకు దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా నిధులను ఎగనామం పెట్టారని, ఐదెకరాల నుంచి మొదలుపెట్టి నెలకు ఒకట్రెండు ఎకరాల చొప్పున కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై గ్రామాల్లో రైతులు పొలాలు దున్ని నాట్లు వేస్తుంటే.. మార్కెట్లో యూరియా దొరకక అల్లాడిపోతున్నారని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాప్’ విధానం వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని, ఫెర్టిలైజర్ డీలర్లు, సొసైటీ అధికారులు తమకు నచ్చిన వాళ్లకు ఓటీపీల ద్వారా బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో రూ. 500 నుంచి రూ.600కు బస్తా యూరియా అమ్ముతుంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మూడేళ్లలో మూడుసార్లు ఎరువుల ధరలు పెంచినా నోరు మెదపని సీఎం, ఇప్పుడు ‘ఎల్ నినో’ అంటూ సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఒక పండుగలా సాగింది. రైతు రాజులా బతికాడు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రైతుల నడ్డి విరిచారు. రైతు భరోసా లేదు, రైతు బీమా బంద్ అయింది, బోనస్ అన్నది బోగస్ మాటగా మారిందన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా.. ప్రజలను మోసం చేసినందుకే రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చిందన్నారు. ‘హైడ్రా’ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూలుస్తూ, మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవడమే ఈ ప్రభుత్వ ఏకైక ఆశయంగా మారిందని విమర్శించారు.
కేసీఆర్ తన రక్తాన్ని ధారపోసి, రాత్రింబగళ్లు శ్రమించి 4 ఏళ్లలోనే కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును నిర్మిస్తే.. దానిపై కాంగ్రెస్ నేతలు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. వందల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేస్తూనే.. మళ్లీ అదే కాళేశ్వరం నీళ్లను సాగు, తాగునీటికి ఎలా వాడుకుంటున్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసి ప్రాజెక్ట్ గేటు చిన్న రిపేరు వస్తే చేయలేక నీరంతా వృథాగా వదిలేసిన చేతకాని ప్రభుత్వం ఇదని.. అదే కేసీఆర్ ఉంటే రెండు రోజుల్లో గేట్లు బాగు చేసేవారని గుర్తు చేశారు. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీష్ రావుపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు బూతుల పురాణం అందుకుంటున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగ రక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతర వేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటిసి తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, మల్లారం మాజీ సర్పంచ్ దాసరి సంజయ్ కుమార్, నాయకులు నోముల వెంకటేశ్వర్లు, రాచకొండ యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, గోలి శివ పాల్గొన్నారు.