– ఎలీ బ్రాడ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అనంతుల హిమని
నీలగిరి, జులై 01 : నల్లగొండ స్థానిక పాఠశాల నుండి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా ఎదిగిన నల్లగొండ యువతి డాక్టర్ అనంతుల హిమని అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రముఖ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలోని ఎలీ బ్రాడ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది.
నల్లగొండ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి, సీనియర్ అడ్వకేట్ అనంతుల శంకరయ్య దంపతుల కుమార్తె అయిన హిమని, నల్లగొండలోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో పదో తరగతి పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, IIT-JEEలో ఆల్ ఇండియా 622వ ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందింది.
ఇంజినీరింగ్ అనంతరం ఓలా క్యాబ్స్‌లో పనిచేసిన హిమని, తర్వాత హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో పరిశోధన సహాయకురాలిగా సేవలందిస్తూ పరిశోధనలో తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది. ప్రముఖ అధ్యాపకులు ప్రొఫెసర్ అచల్ బస్సాంబూ, ప్రొఫెసర్ మిలింద్ సోహోని మార్గదర్శకత్వంలో ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ విజయవంతంగా పూర్తి చేసింది.
అమెరికాలో ఉన్నత విద్య, పరిశోధనలు ప్రతిభ, పట్టుదల ఉన్న ప్రతి విద్యార్థికి అందుబాటులోనే ఉన్నాయని డాక్టర్ హిమని తెలిపారు. అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అనేక పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు పూర్తిగా నిధులతో (Fully Funded) నిర్వహించబడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు మాఫీతో పాటు, నెలకు సుమారు 3,500 అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.2.9 లక్షలు) స్టైపెండ్, పూర్తి ఆరోగ్య బీమా, పరిశోధన సహాయం అందుతాయని వివరించారు. దీంతో ఆర్థిక భారం లేకుండానే ప్రపంచ స్థాయి పరిశోధనలు చేయవచ్చని చెప్పారు.
స్థానిక విద్యా సంస్థల నుండి విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో అధ్యాపకురాలిగా ఎదిగిన డాక్టర్ హిమని విజయం నల్లగొండకే కాకుండా తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం. గ్లోబల్ స్థాయిలో రాణించాలని కలలు కనే విద్యార్థులకు ఆమె ప్రయాణం మార్గదర్శకంగా నిలుస్తుందని విద్యావేత్తలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.