Limestone Mines | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 16 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో మూడు సున్నపురాయి గనుల వేలంలో జరిగిన అవకతవకలపై కేంద్రం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ-వేలం నిర్వహించారంటూ సామాజిక కార్యకర్త ఒకరు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై మూడు నెలల తర్వాత స్పందించిన సంబంధిత శాఖ అధికారులు ఆ ఫిర్యాదును తిరిగి తెలంగాణ గనుల శాఖకే పంపినట్టు సమాధానం ఇవ్వడంతో సదరు కార్యకర్త విస్మయం చెందారు.
తాను ఎవరిపై ఫిర్యాదు చేశానో వారికే తన ఫిర్యాదును పంపి చేతులు దులుపుకోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ గనుల శాఖ.. అటవీ శాఖ నుంచి ఎలాంటి నిరభ్యంతర ధ్రువీకరణ లేకుండానే అటవీ ప్రాంతంలోని గనులకు ఈ-వేలం నిర్వహించినట్టు జిల్లా అటవీ శాఖ తేల్చడం గమనార్హం.
తెలంగాణ గనుల శాఖ 2024 ఆగస్టులో సూర్యాపేట జిల్లాలోని అటవీ ప్రాంతంలో మూడు సున్నపురాయి గనుల (పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్పూర్)కు ఈ-టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మూడు బ్లాకుల్లో.. ఏ కంపార్టుమెంట్లో, ఎంత విస్తీర్ణంలో ఈ-వేలం నిర్వహిస్తున్నామనే వివరాలను లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మూలల వివరాలు (డీజీపీఎస్-డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం కార్నర్ పాయింట్లు) సహా ఇవ్వాల్సి ఉన్నది. కేంద్ర గనుల శాఖ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి రాష్ట్ర గనుల శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి.
సైదుల్నామా బ్లాకులోని దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్పూర్ బ్లాకులోని అటవీ ప్రాంతంలో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ కు సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులు హైకోర్టులో పెండింగులో ఉన్నాయి. గనుల శాఖ డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు లేకుండా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ఈ-టెండర్లలో ఆయా బ్లాకులు ఆ కంపెనీలకే దక్కడం అనుమానాలకు తావిస్తున్నది. ఎలాంటి ఆరోపణలులేని పసుపులబోడు బ్లాకుకు పోటీ లేకపోవడంతో అధికారులు దానిని రద్దుచేశారు.
గత ఏడాది డిసెంబర్ 20న దీనిపై సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి మంత్రిగా ఉన్న గనుల శాఖకే ఫిర్యాదు చేయగా, మూడు నెలల తర్వాత ఆ శాఖ నుంచి జవాబు రావడం గమనార్హం. కేంద్ర మంత్రిత్వ శాఖలకు వచ్చే ఫిర్యాదులను 45 రోజుల్లో పరిష్కరించాలనే మార్గదర్శకాలు గతంలో ఉండేవి. దానిని 30 రోజులకు తగ్గించినట్టు తెలిసింది.
కేంద్ర గనుల శాఖ జారీ చేసిన గెజిట్‌లోని మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి తెలంగాణ గనుల శాఖ ఈ-వేలం నిర్వహించిందని ఫిర్యాదు చేస్తే నిర్ణీత సమయంలోగా స్పందించకపోవడం గమనార్హం. గత మార్చి 18న స్పందించిన కేంద్ర గనుల శాఖ సదరు ఫిర్యాదును తెలంగాణ గనుల శాఖకు పంపినట్టు సమాధానమిచ్చింది. ఆలస్యంగా స్పందించడంతోపాటు భారీ స్కాం జరిగిందని ఫిర్యాదు చేసినా కేంద్రం స్పందించకపోవడంపై వెంకట్‌రెడ్డి సంబంధిత వెబ్సైట్లోనే రిమార్కు కాలంలో అసంతృప్తిని వ్యక్తపరిచారు.
ఇదే అంశంపై వెంకట్‌రెడ్డి.. సూర్యాపేట జిల్లా అటవీ శాఖ అధికారికి సమాచార హక్కు చట్టం కింద వివరాల కోసం దరఖాస్తు చేశారు. తెలంగాణ గనుల శాఖ ఈ-వేలం నిర్వహించిన మూడు బ్లాకులకు సంబంధించిన కంపార్టుమెంట్లు, ఎన్వోసీ వివరాలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ మూడు బ్లాకుల్లో అసలు కంపార్టుమెంట్లుగా విభజించలేదని, జిల్లా అటవీ శాఖ ఎన్వోసీ జారీ చేయలేదని జిల్లా అటవీ శాఖ అధికారి స్పష్టంచేశారు. అటవీ శాఖ అనుమతి లేకుండానే అటవీ ప్రాంతంలోని మూడు సున్నపురాయి బ్లాకులకు గనుల శాఖ అధికారులు ఈ-వేలం నిర్వహించడం ఏమిటని వెంకట్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
అక్రమ మైనింగ్ ఆనవాళ్లు చెరిపివేసేందుకే ఈ-వేలంలో అవకతవకలకు పాల్పడ్డారని, ఇది దాదాపు రూ.1,500 కోట్ల స్కాం అని వెంకట్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ-వేలం వ్యవహారంలో తాము జారీ చేసిన మార్గదర్శకాలకు రాష్ట్ర గనుల శాఖ తిలోదకాలు ఇచ్చినా, కేంద్రం స్పందించకపోవడం ఏమిటని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టంచేశారు.
తెలంగాణ గనులు, భూగర్భ శాఖ.. ఖనిజ నిక్షేపాలున్న రిజర్వు ఫారెస్టులోని ప్రాంతాలను వేల ఎకరాల విస్తీర్ణంలోని బ్లాకులుగా… ఆపై వాటిలోనే కంపార్టుమెంట్లుగా విభజిస్తుంది. ఆ మేరకు రికార్డుల్లో కంపార్టుమెంట్ల నంబర్లను కూడా నమోదు చేస్తారు. గత ఏడాది ఇచ్చిన ఈ-టెండర్ నోటిఫికేషన్లో సుల్తాన్పూర్, సైదుల్నామా, పసుపులబోడు బ్లాకుల్లో కొంత విసీర్ణంలో సున్నపురాయి మైనింగ్ లీజు వేలం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సైదుల్నామా బ్లాకులో 421.9 ఎకరాల్లో వేలం లీజు చేపట్టారు. వాస్తవానికి సైదుల్నామా బ్లాకులోని అటవీ ప్రాంత విస్తీర్ణం సుమారు 3,102 ఎకరాలు.
ఈ-టెండర్ నోటిఫికేషన్లోనే డీజీపీఎస్ కార్నర్ పాయింట్లను అక్షాంశాలు, రేఖాంశాలు సహా ఇవ్వాల్సి ఉన్నది. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్నర్ పాయింట్లు ఇవ్వకపోగా కనీసం ఆయా బ్లాకుల్లోని ఏ కంపార్టుమెంటు అనేది కూడా బహిర్గతం చేయకపోవడం గూడుపుఠాణీ జరిగిందనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది. ఈ-టెండర్ నోటిఫికేషన్‌లోని ‘ఖనిజ మైనింగ్ బ్లాక్ సారాంశం (సమ్మరీ)’ 1(2) కార్నర్ పాయింట్లు (లాటిట్యూడ్, లాంగిట్యూడ్) అనే కాలమ్‌లో ‘డీజీపీఎస్ కార్నర్ పాయింట్లను ‘అనుబంధం 1బీ’లో ప్రచురించాం అని పేర్కొన్నారు. అంటే టెండరు నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు చెల్లించి బిడ్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఇస్తామనేది దాని సారాంశం.
అయినవారు కాకుండా కానివారు ఎవరైనా బిడ్ కొనుగోలు చేసినప్పుడైనా డీజీపీఎస్ కార్నర్పాయింట్లు ఇచ్చారా? లేదా? అనేది కూడా అంతుబట్టని అంశం. ఈ నేపథ్యంలో రిజర్వు ఫారెస్టులోని ఆ బ్లాకుపై పూర్తి అవగాహన ఉన్నవారికి మాత్రమే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. తద్వారా కొత్తవారు ఎవరూ ఈ టెండర్లలో పాల్గొనేందుకు ముందుకురారు. పైగా మైనింగ్ లీజు వేలం ఇస్తున్న విస్తీర్ణం పూర్తి బ్లాకు విస్తీర్ణంతో పోలిస్తే 7-16% వరకు మాత్రమే ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం చెప్తున్న ఆ ప్రాంతం ఎక్కడ, ఏ మూలకు ఉన్నది? వేలం దక్కించుకున్న కంపెనీలు ఎక్కడ మైనింగ్ చేయాలి? ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తే దానికి లెక్క, ప్రాతిపదిక ఏముంటుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
న్యాయస్థానాల్లో అక్రమ మైనింగ్‌పై కేసులు పెండింగులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం వేలం టెండర్ల ప్రక్రియను చేపట్టినందున తిరిగి సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అసలు టెండర్ల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఖనిజాల మైనింగ్, అనుబంధ కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (న్యాయ) ఆర్ రామకృష్ణారెడ్డి సమాధానమిచ్చారు.
అయితే, వెంకట్‌రెడ్డి తన దరఖాస్తులో కోరిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తున్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్ తన లేఖలో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం-8(ఏ),(డీ),(ఇ), (జీ),(ఐ)ను అనుసరించి సమాచారాన్ని బహిర్గతం చేయలేమని అందులో స్పష్టంచేశారు.
అయితే ఆర్టీఐ చట్టంలోని ఈ సెక్షన్లను పరిశీలించగా.. వ్యక్తుల ప్రాణాలకు హాని ఉన్నప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయలేమని తేలింది. అంటే ఇప్పుడు సున్నపురాయి గనుల లీజు వేలం సమాచారాన్ని బయటపెడితే ఎవరి ప్రాణాలకు హాని కలుగుతుంది? ప్రాణహాని ఎవరు తలపెడతారు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి ఈ వ్యవహారంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు ఫిర్యాదు చేయగా… ఫిర్యాదును నమోదు చేసుకొని పరిశీలిస్తున్నట్టు సీవీసీ స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఉద్దేశపూర్వకంగానే సున్నపురాయి మైనింగ్ లీజు వేలం ఈ-టెండర్ల ప్రక్రియను నిర్వహించారనేందుకు మరింత బలాన్ని చేకూర్చేలా ఆయా బ్లాకుల్లో అభియోగాలున్న సిమెంటు కంపెనీలే ఆ బ్లాకులో లీజు వేలాన్ని దక్కించుకోవడం గమనార్హం.