హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8వ పే కమిషన్ను కేంద్రం మంగళవారం నియమించింది. తెలంగాణలో మాత్రం పీఆర్సీ పత్తాలేకుండా పోయింది. ఆరు నెలల్లోపు కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ గ్యారెంటీ గాలిలో కలిసింది. అసలు పీఆర్సీపై సర్కారులో ఇసుమంతైనా కదలిక లేకపోవడం విచారకరమని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023, జూన్ 30తో ముగియగా, అదే ఏడాది జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది.
కాగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్ బీ రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉండగా, 2024 ఏప్రిల్ 2తో ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును ఆరునెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ రెండుకు పీఆర్సీ కమిటీని నియమించి రెండేండ్లు పూర్తయ్యింది. ఈ పీఆర్సీ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. ఉద్యోగ సంఘాల నేతలు 51 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని కమిటీ ముందు ప్రతిపాదించారు.
పీఆర్సీ ఇవ్వడం ఇష్టంలేక..
వాస్తవానికి పీఆర్సీ కమిటీ ఎప్పుడో సమగ్ర నివేదికను రెడీ చేసింది. ఈ నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. కానీ ఇందు కు ప్రభుత్వం అనుమతించడం లేదు. ఒకశాతం ఫిట్మెంట్ ప్రకటించినా.. నెలకు రూ. 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. అయితే ఉద్యోగులు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువగా 25% ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు రూ. 5 వేల కోట్ల చొప్పున అందుతాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీఆర్సీ నివేదికను స్వీకరిస్తే బంతి సర్కారు కోర్టులోకి చేరుతుంది. ఫిట్మెంట్ను ప్రకటించాలని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తంగా ఉద్యోగులకు వేతన సవరణ చేయడం ఇష్టంలేని ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించడంలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండేండ్లుగా తాము నష్టపోతున్నామని గగ్గోలుపెడుతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.