Rayalaseema Lift | హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): ఏపీ సర్కారు చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. అనుమతులు కావాలంటే ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకువచ్చాకే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ఈఏసీ మీటింగ్‌లో నిర్ణయించింది. అనుమతులు లేకుండానే ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్జీటీని ఆశ్రయించింది. ప్రాజెక్టు పనులను నిలిపివేయించింది. అయినప్పటికీ అర్ధరాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ ఏపీ సర్కారు ఆ పనులను కొనసాగిస్తుండగా, దానిని ‘నమస్తే తెలంగాణ’ ఫొటోలతో సహా బట్టబయలు చేసింది.
ఈ నేపథ్యంలో అటు తర్వాత ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేయడం, ఎన్జీటీ సైతం తీవ్రంగా పరిగణించడంతో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో 2020 మే 5న ఏపీ సర్కారు జీవో జారీచేసింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టును పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాల్ని తరలించేందుకు తెరపైకి తీసుకొచ్చారు.
అదేరీతిన 15.07.2020 న పెన్నా బేసిన్లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు రూ.1,415 కోట్లతో చేపట్టేందుకు జీవో నంబర్ 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణాబోర్డు, కేంద్రానికి అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందకుపోవద్దని గతంలోనే కేంద్ర జల్‌శక్తి ఆదేశానుసారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీకి ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ సర్కారు సైతం అందులో ఇంప్లీడ్ అయ్యింది. ఆ పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చేవరకూ పనులను చేపట్టవద్దని, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
దానిని సాకుగా చేసుకుని ఏపీ ప్రభుత్వం ఏకంగా టెండర్లను ఖరారు చేయడంతో పాటు యుద్ధప్రాతిపదికన పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఎన్జీటీని ఆశ్రయించింది. ప్రాజెక్టు పనులను స్వయంగా ఎన్జీటీ బృందమే సందర్శించాలని ప్రత్యేకంగా కేసీఆర్ సర్కారు అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేయగా, పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్ని అబద్ధమేనని ఆ కమిటీ నివేదించింది. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతులు పొందేవరకూ పనులను చేపట్టవద్దని, కనీసం డీపీఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి 2021 డిసెంబర్లో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే కొద్దిరోజుల పాటు స్తబ్ధుగా ఉన్న ఏపీ సర్కారు తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమైన వేళ ప్రాజెక్టు పనులను మళ్లీ ముమ్మరం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి మరీ అర్ధరాత్రి వేళ పనులు కొనసాగించడంపై ‘దొంగరాత్రి సీమ లిఫ్ట్ పనులు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో వెంటనే ఉలిక్కిపడిన రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వెంటనే కేంద్రానికి, ఎన్జీటీకి, కేఆర్ఎంబీకి లేఖలు రాసి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏపీ సర్కారు సైతం పనులను నిలిపివేసింది.
అనుమతుల నిరాకరణ..
ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్ఎల్ఐసీకి పర్యావరణ అనుమతుల మంజూరుకు తాజాగా కేంద్రం నిరాకరించింది. రాయలసీమ ఎత్తిపోత పథకానికి పర్యావరణ అనుమతుల కోసం ఏపీ సర్కారు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకున్నది. దానిపై ఇటీవల ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ)లో చర్చించారు. అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లఘించి, పర్యావరణ అనుమతులు లేకుండానే ఏపీ సర్కారు పనులను చేపట్టిందని కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాదు మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రాజెక్టు స్థలాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని తేల్చిచెప్పింది. కేంద్ర పర్యావరణశాఖ నిర్ణయాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు.