Damodara Raja Narasimha | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రెండు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను ఇంకా విడుదల చేయలేదు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మాతాశిశు సంక్షేమ సేవలు, ఇమ్యునైజేషన్, కమ్యునికేబుల్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్స్, ఆరోగ్య సేవా కేంద్రాల నిర్వహణలో తీవ్ర అంతరాయం కలుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తున్నది. ఈ నేపథ్యంలో రూ.347 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్హెచ్ఎం కింద రాష్ర్టానికి రూ.1,480 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. దీనిలో కేంద్రం వాటా రూ.888 కోట్లు (60 శాతం) కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.592 కోట్లు (40 శాతం). కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి నాలుగు విడుతల్లో నిధులను విడుదల చేస్తుంది. మొదటి ఆరు నెలల నిధులే విడుదలయ్యాయని, మూడు, నాలుగో త్రైమాసికాల నిధులు ఇంకా విడుదల కాలేదని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. మూడో విడతకు సంబంధించి కేంద్రం విధించిన అన్ని నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుడు నవంబర్ 6న ప్రతిపాదనలు పంపించామని గుర్తుచేశారు. నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
17 వేల మందికి అందని వేతనాలు
వేతనాలు అందక ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో సుమారు 17,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో ఆశా కార్యకర్తలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీ, ఇతర విభాగాల సిబ్బంది ఉన్నారు. కేంద్రం ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో మూడు నెలలుగా వారి కుటుంబాలు అవస్థులు పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర నిధుల నుంచి వేతనాలు ఇచ్చి, తమ కుటుంబాలను పస్తుల నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.