హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం ఆది నుంచి అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. తొమ్మిదేండ్లుగా అనేక విధాలుగా వేధిస్తున్నది. ఏం అడిగినా ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా అవస్థలు పెడుతున్నది. చివరికి, చట్టప్రకారం రావాల్సిన నిధుల్లోనూ కోతలు విధుస్తూ.. కొర్రీలు పెడుతున్నది. అదేమని అడిగితే.. వెతికి మరీ సాకులు చెప్తున్నది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన రూ.1350 కోట్లు ఇవ్వడం లేదని, ఎందుకు ఇవ్వట్లేదని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని.. సోమవారం పార్లమెంట్లో బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఆర్థిక చేయూతను ఇస్తున్నాం. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు తొమ్మిదేండ్లలో తెలంగాణకు రూ.2,250 కోట్లు అందజేశాం. యుటిలైజేషన్ ఇస్తే.. కేంద్రం వద్ద ఉన్న వనరుల లభ్యత ఆధారంగా మిగిలిన నిధుల గురించి ఆలోచిస్తాం. అంటూ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నదని, నిధులు ఉంటే ఇస్తామంటూ తొండి మాటలు చెప్తున్నది.
అభివృద్ధి నిధులు, పథకాలు, ప్రాజెక్టుల మంజూరు సహా అన్ని అంశాల్లోనూ బీజేపీపాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణను కేంద్రం విస్మరిస్తుస్తున్నది. ములుగులో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని ఏపీకి, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించింది. హైదరాబాద్‌కు దకాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తీరని ద్రోహం తలపెట్టింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌తోపాటు ఇతర బీజేపీపాలిత రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు నిధుల వరద పారించిన కేంద్ర ప్రభుత్వం.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదలతో అతలాకుతలమైన హైదరబాద్‌కు నయాపైసా విదల్చలేదు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఆర్బిట్రేషన్ సెంటర్) ఏర్పాటుకు పైసా ఇవ్వకపోగా గుజరాత్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ‘బల్‌డ్రగ్ పార్’ పథకంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఏపీలకు చోటు కల్పించి అన్ని అనుకూలతలున్న హైదరాబాద్‌కు వెన్నుపోటు పొడిచారు. భారీ లాభాలను గడిస్తున్న సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా ఆ సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలా.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే కేంద్రంలోని మోదీ సర్కారు అక్కసు వెళ్లగక్కుతున్నది. తెలంగాణ ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఎదుగుతుండగా.. కేంద్రం మాత్రం అడుగడుగునా మోకాలడ్డుతున్నది. చివరికి చట్టబద్ధంగా దక్కాల్సిన నిధులనూ ఇవ్వకుండా వేధిస్తున్నది. పచ్చి అబద్ధాలు చెబుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది.
తెలంగాణకు రావాల్సిన యాన్యువల్ గ్రాంట్ల విడుదల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వకుండా కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నేను అనేకసార్లు పార్లమెంట్లో ప్రస్తావించాను. అయినప్పటికీ, కేంద్రం ఏమాత్రం స్పందించటం లేదు.
– నామా నాగేశ్వరరావు, ఎంపీ