హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వానాకాలం ధాన్యం సేకరణలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేపట్టింది. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం సివిల్ సప్లైస్ కమిషన్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోల్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 46 లక్షల క్వింటాళ్ల బియ్యానికి సమానమైన 68.65 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణలో జనవరి మూడో తారీకు వరకూ 65.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు.
మిగతా ధాన్యం ఎంత వచ్చినా సేకరణ కొనసాగుతుందన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ చేసిందని, దాదాపు 6,868 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించామని పేర్కొన్నారు.
ఇందులో 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తి కావడంతో మూసివేసామన్నారు. దాదాపు 11 లక్షల 90 వేల మంది రైతుల నుంచి 12,761 కోట్ల విలువ గల ధాన్యాన్ని సేకరించామని వివరాలను వెల్లడించారు. ఇందులో 8 లక్షల మందికి 10,394 కోట్ల రూపాయల డబ్బుల్ని సైతం అందజేసామన్నారు.
ఎఫ్.సి.ఐకి సీఎంఆర్ అందజేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఈ వానాకాలంకు సంబందించి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేసామన్నారు.
కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్ రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, వాణీభవాని, నసీరుద్దిన్, పౌరసరపరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి తధితర అధికారులు పాల్గొన్నారు.