హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): గత సంవత్సరం వానకాలం సీజన్ సీఎమ్మార్ (బియ్యం)కు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మిల్లర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో గడువులోగా ఎఫ్‌సీఐకి సీఎమ్మార్(బియ్యం) ఇవ్వని ఫలితంగా ఈ భారీ ఆర్థిక నష్టం జరిగింది. 2023-24 వానకాలం సీజన్‌కు సంబంధించి సీమ్మార్ గడువును పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. యాసంగి సీమ్మార్కు మాత్రమే జనవరి 25 వరకు గడువు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వానకాలం సీఎమ్మార్ బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనున్నది.
గత వానకాలానికి సంబంధించి 47.34 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఇందుకు మిల్లర్లు సుమారు 32 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉన్నది. ఈ బియ్యం అప్పగించేందుకు ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసింది. గడువు ముగిసేనాటికి మిల్లర్లు 29 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా మూడు లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ మళ్లీ గడువు పొడిగిస్తుందేమోనని భావించారు. ఎఫ్‌సీఐ ఇందుకు నిరాకరించడంతో ఈ బియ్యాన్ని ఇక రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. సీఎమ్మార్‌కు సంబంధించి అన్ని చార్జీలు కలిపి కేజీ బియ్యానికి రూ.36 చొప్పున ఎఫ్‌సీఐ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు చెల్లిస్తుంది. ఈ లెక్కన వానకాలానికి సంబంధించి మిల్లర్ల వద్ద మిగిలిపోయిన మూడు లక్షల టన్నుల బియ్యం విలువ సుమారు రూ.1,080 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఎఫ్‌సీఐ బియ్యం తీసుకొని డబ్బులు ఇవ్వదు కాబట్టి.. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో ఎఫ్సీకి బియ్యం ఇచ్చి ఉంటే ఆ మొత్తం సివిల్ సైప్లెకి ఎఫ్‌సీఐ నుంచి వచ్చేవి.
మరోవైపు, గత యాసంగికి సంబంధించి 48 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇవ్వగా, వారు 33 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉన్నది. ఇందులో ఇప్పటివరకు 19 లక్షల టన్నుల బియ్యం ఇవ్వగా, మరో 14 లక్షల టన్నుల బియ్యం బకాయి పడింది. దీని విలువ రూ.5,040 కోట్లు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో యాసంగి సీఎమ్మార్ ఇచ్చేందుకు జనవరి 25 వరకు గడువు లభించింది.