సిద్దిపేట : రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. వడ్ల కొనుగోళ్లను ఆలస్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం మిల్లర్లపై తనిఖీలకు పాల్పడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. గురువారం సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది.
తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిందన్నారు. జిల్లాలో తడిసిన ధాన్యాన్ని స్వయంగా అన్ని మార్కెట్లకు వెళ్లి చూశాం. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం ఆరబెట్టేందు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో పండిన పంట అంతా కొనే విధంగా 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
421 సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేశా. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. 4 వేల టార్పాలిన్ కవర్లు ఒక్క సిద్దిపేటలోనే కొనుగోలు చేశామని మంత్రి వివరించారు.రైతులు ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే ఆదే రోజు కొనడానికి అవకాశం ఉంటుందని హరీశ్ రావు సూచించారు.
దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉంది. కానీ తెలంగాణ వడ్లు కొనమని మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతుందని ఘటుగా విమర్శించారు. రా రైస్ కొంటం. బాయిల్డ్ రైస్ కొనం అన్నరు. వేసవిలో తెలంగాణలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల భారం వహించి రైతులను కాపాడాలని, రైతులకు మద్దతు ధర కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నరు.
కానీ కక్ష్య కట్టిన కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే సమయంలో 2,900 రైస్ మిల్లులపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెల ఆగి దాడులు చేస్తే ఎమవుద్ది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వడ్లు కొనొద్దు అన్న కారణంతో ఎఫ్సీఐ అధికారులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.
మిల్లు యాజామాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నరు. లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుతుంది. మీ ఉద్దేశం ఏం? వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలి. రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నరు. కుట్రతోనే కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నం.
రైతు సోదరులు దీన్ని గమనించాలన్నారు. సీఎం కేసీఆర్ 3 వేల కోట్లతో ధాన్యం కొనాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రైతులు మిల్లర్ల వద్ద ధాన్యం దింపకుండా ఉండేలా చేస్తోంది. తడిస్తే రైతులు ఇబ్బంది పడేలా.. తెలంగాణ ప్రభుత్వంపై కోపం వచ్చేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం బీజేపీ కుట్రలు గమనించాలన్నారు. నల్ల చట్టాలు తేలేదు కాని, నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారని ఎద్దేవా చేశారు. బాయిలకాడ మీటర్లు పెట్టాలంటున్నారు.
డిజీల్ ధరలు పెంచారు. ట్రాక్టర్ తో దున్నడానికి ఎకరానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది. వరి కోత మిషన్ తో పని ఇవాల రెండు వేలు దాటింది. ఎరువుల ధరలు పెంచారు. రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. తనిఖీల పేరుతో మిల్లర్లు వడ్లు కొనుగోలు చేయకుండా చేస్తున్నరు. ఈ పద్ధతిని విరమించుకోవాలి. రైతులను ఇబ్బందిపెట్టడం కేంద్రానికి తగని మంత్రి హితవు పలికారు.