హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనగణన చేపడతామనే రాజకీయ ప్రకటనలు రావడం పరిపాటిగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం అలాకాకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, న్యాయపరమైన చికులు రాకుండా, బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే జనగణన నిర్వహించాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. జనగణన జరపడమంటే కులాల సంఖ్యను లెకించడమే కాదని, సమాజంలోని అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతుల వివరాలను సేకరించాలని, ఆ దిశగా సమగ్ర అధ్యయనం జరపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకు, సర్వేలకు పరిమితం కాకుండా సమగ్రమైన జనగణన సత్వరం చేపట్టాలని డిమాండ్ చేశారు.