ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పత్రిక, సినిమా, సాహిత్యరంగాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకే దకుతుందని, తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ
రామోజీరావు మృతితో భారత మీడియా రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన సేవలు చిరకాలం గుర్తుంటాయి.
– ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి
పత్రికా రంగం, సినీ పరిశ్రమపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. భారత పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు ఆయన.
– నరేంద్ర మోదీ, ప్రధాని
రామోజీరావు జర్నలిజం, సినిమా, వినోద రంగాలకు చేసిన సేవల ప్రభావం చిర కాలం ఉంటుంది.
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
రామోజీరావు మరణం తెలుగు ప్రజల కు తీరని లోటు. జర్నలిజం, ఎలక్ట్రానిక్ మీడియా, వ్యాపార రంగాలకు ఆయన అమూల్యమైన సేవలు అందించారు.
– నిర్మలా సీతారామన్
రామోజీరావు మృతి తెలుగు పత్రిక, వ్యాపార రంగాలకు తీరని లోటు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, దశదిశ చూపిన దార్శనికుడు రామోజీ. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబీకులకు సానుభూతి.
-సీఎం రేవంత్‌రెడ్డి
స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రామోజీరావు జీవితం ప్రతి ఒకరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఫిలింసిటీలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జీవితంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులెదురైనా గొప్ప విజయాలను ఎలా సాధించవచ్చో ఆయన ప్రస్థానం ద్వారా మనం నేర్చుకోవచ్చని వివరించారు. తెలుగు మీడియా, వినోదరంగాల్లో రామోజీ చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఎంతో ఆప్యాయత కలిగిన రామోజీరావు అంటే తనకు చాలా గౌరవమని, దశాబ్ద కాలంలో చాలాసార్లు ఆయనతో మాట్లాడే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన మాటలు తనలో ఎంతో స్ఫూర్తి నింపాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రామోజీ పార్థివదేహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, తెలుగు ప్రజలకే కాకుండా దేశానికి ఆయన మరణం తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేశారు. సాధారణవ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని, నిరంతర శ్రమ, చెదరని ఆత్మస్థయిర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలిగలిసిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి అని, సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారని వివరించారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, వేల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపారని గుర్తుచేశారు. రామోజీరావు కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆశయాలను నెరవేర్చుకొనేందుకు రామోజీరావు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు. ఒక మహా వ్యక్తిని, శక్తిని కోల్పోయాం.
– చిరంజీవి, ప్రముఖ సినీ నటుడు