హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): భారత దేశ భద్రతపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌కు బలమైన సందేశమిచ్చారు. మాటలతో యుద్ధాలను గెలువలేమని, నిర్ణాయక కార్యాచరణతోనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ తామే విజయం సాధించామని దాయాది దేశం ప్రకటించుకోవడంపై ఆయన స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)లో జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తూ.. నిర్ణయాలను వేగంగా అమలు చేయడం ద్వారానే నిజమైన దృఢత్వం లభిస్తుందని తెలిపారు.
బలహీన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని పలుప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయని, దానివల్ల తరచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయని పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకలంటించారు. దృఢమైన వ్యవస్థ, ప్రజాస్వామ్యం, సాయుధ దళాల నైపుణ్యం భారత్‌కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ భారత సాయుధ బలగాలు దేశ భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, వాటి నైపుణ్యం, నిబద్ధత అమోఘమని కొనియాడారు. కొత్తగా విధుల్లో చేరుతున్న యువ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ పరేడ్‌లో 244 మంది ఫ్లైట్ క్యాడెట్లకు రాష్ట్రపతి కమిషన్‌ను ప్రదానం చేశారు. వారిలో 215 మంది పురుషులు, 29 మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ తనిష్ అగర్వాల్‌కు ‘నవానగర్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్’తోపాటు రాష్ట్రపతి ఫలకం దకింది. నావిగేషన్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ సాక్ష్యం డోబ్రియాల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ నితీశ్ కుమార్ ‘ప్రెసిడెంట్ ప్లాక్’ పురసారాలు అందుకున్నారు. పీసీ-7, హాక్, కిరణ్, చేతక్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు, ఆకాష్ గంగ టీమ్, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.