హైదరాబాద్ : వర్షాల నేపథ్యంలో శానిటేషన్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో అధికారుల సెలవులను రద్దు చేశారు. ఎవరైనా సెలవుల్లో ఉంటే వెంటనే డ్యూటీలో జాయిన్ కావాలని స్పష్టం చేశారు. కంట్రోల్ రూంలు మూడు షిఫ్టుల్లో 24 గంటలు పని చేస్తూనే ఉండాలని చెప్పారు.
మునిసిపాలిటీల్లో నియమించిన ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లు లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
శిథిల భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించడంతో పాటు వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చూడాలని, రిజర్వాయర్లు, చెరువుల్లో వాటర్ లెవెల్స్‌ను పరిశీలించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, డిసిన్ఫెక్టెడ్ మెటీయరిల్స్ను అందుబాటులో ఉంచాలని, అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. చెట్లు విరిగితే తొలగించాలి, విద్యుత్ స్తంభాలు, వాటర్ పైప్లైన్లు దెబ్బతింటే.. వెంటనే తొలగించి కొత్త వాటిని వేయాలని సూచించారు. అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు.