Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ నటించిన చివరి చిత్రంగా ప్రచారం పొందిన ‘జన నాయకన్’ సినిమాకి సంబంధించిన భారీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఎన్నో వాయిదాలు, అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల తేదీపై తాజాగా సినీ వర్గాల్లో ఆసక్తికర సమాచారం చక్కర్లు కొడుతోంది. దీంతో చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గతంలో ఈ చిత్రాన్ని పలుమార్లు విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, వివిధ కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ దాదాపు నిలిచిపోయాయి. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ‘జన నాయకన్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇదే రిలీజ్ డేట్‌ను అధికారికంగా తెలియజేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా విజయ్ సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. నటుడిగా ఆయన చివరి చిత్రం కావడం వల్ల అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం విజయ్‌కు గ్రాండ్ ఫేర్వెల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యువ నటి మమితా బైజు కూడా కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దర్శకుడు-నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్-అనిరుధ్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో, ‘జన నాయకన్’ సంగీతంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.