హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నగరాలు, పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసేందుకు మున్సిపల్ శాఖ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది. మొదటి దశలో వీటిని రూ.21 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలిచారు. హైదరాబాద్లోని యూనిట్లు మంచి ఫలితాలను ఇస్తుండటంతో ఇతర పట్టణాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని వ్యర్థాలు ఎక్కువగా ఉన్న 65 పట్టణ స్థానిక సంస్థలను 6 క్లస్టర్లుగా విభజించి తొలి విడతగా వరంగల్ క్లస్టర్లో 200 టీపీడీ (టన్స్ పర్ డే), నల్లగొండలో 100 టీపీడీ, సంగారెడ్డిలో 50 టీపీడీ సామర్థ్యంతో సీఅండ్డీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డీబీఎఫ్వోటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో ఏర్పాటవుతాయి. టెండరు దక్కించుకున్న సంస్థ 10 ఏండ్ల పాటు సీఅండ్డీ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే కాంట్రాక్టును మరో 5 ఏండ్లు పొడిగిస్తారు.
శిథిలమైన ఇండ్లను కొత్త ఇండ్లను నిర్మించేవారు, పాత భవనాలకు మరమ్మతులు చేసేవారు ఆ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో నగరాలు, పట్టణాలు అపరిశుభ్రంగా మారి ప్రజలకు అసౌకర్యంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీఅండ్డీ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ ప్రాజెక్టు మున్సిపాలిటీకి సమాచారం ఇస్తే సంబంధిత సీఅండ్డీ యూనిట్ వాహనాలు వచ్చి నిర్మాణ వ్యర్థాలను తీసుకెళ్తాయి. వాటిని శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి, సమాజానికి అవసరమయ్యే ఉత్పత్తులను తయారు చేస్తారు. అలా కాకుండా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చర్యలు తీసుకుంటారు.
ప్రస్తుతం సీఅండ్పీ యూనిట్లు ఏర్పాటు కానున్న మూడు క్లస్టర్ల పరిధిలో వివిధ మున్సిపాలిటీలను చేర్చారు. వరంగల్ క్లస్టర్ పరిధిలోకి ఆలేరు, చేర్యాల, జనగామ, డోర్నకల్, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, వర్థన్నపేట, సిద్దిపేట మున్సిపాలిటీలు వస్తాయి. చండూరు, చిట్యాల, చౌటుప్పల్, దేవరకొండ, హాలియా, హుజూర్నగర్, మిర్యాలగూడ, నేరేడుచర్ల, సూర్యాపేట మున్సిపాలిటీలను నల్లగొండ క్లస్టర్లో.. అమీన్పూర్, బొల్లారం, మెదక్, నర్సాపూర్, సదాశివపేట, తెల్లాపూర్, తూప్రాన్, వికారాబాద్, జహీరాబాద్, ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలను సంగారెడ్డి క్లస్టర్లో చేర్చారు.