హైదరాబాద్ సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, మే 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో నలుగురు నిందితులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలను బెంగళూరు నుంచి రప్పించి విచారిస్తున్నారు. దాడిలో ఉపయోగించిన స్కార్పియో వాహన యజమాని గుర్తింపు పనిలో పోలీసులు ఉన్నారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత మాసబ్‌ట్యాంక్‌లో శనివారం ఉదయం హత్యకు గురైన అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది.
పలు వివాదాస్పద కేసుల్లో న్యాయ పోరాటం చేస్తున్న ఆయనను దుండగులు పక్కాప్లాన్‌తోనే రెక్కీ నిర్వహించి హత్య చేసినట్టుగా నిర్ధారించారు. మొయిజుద్దీన్ ఇంటి పరిసరాల్లో , ఆయనను కారుతో ఢీకొట్టి పారిపోయిన వాహనానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నలుగురు దుండగులు ఈ ఘటనలో పాలుపంచుకున్నట్టు చెప్తున్నారు. రెండు, మూడురోజులుగా మాటువేసి ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఆయన దినచర్య ఏమిటి? అన్న విషయాలను పరిశీలించిన దుండగులు.. అక్కడ కొందరితో మాట్లాడి వివరాలు సేకరించినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే ఈనెల 23న ఉదయం ఆరుగంటల సమయంలో నంబర్‌ప్లేట్ లేని స్కార్పియో వాహనంతో ఢీకొట్టి న్యాయవాదిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొదట పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అందులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
దుండగుల కోసం ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ నలుగురు నిందితులను కల్వకుర్తి, గోవాలో పట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసింది. స్కార్పియో నడిపి అడ్వకేట్‌ను హత్యచేసిన ప్రధాన నిందితుడు నగర పరిధిలోని కవాడిగూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనం ఎవరిది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమానిగా ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి విచారించగా, తాను కొన్నినెలల క్రితమే ఆ కారు అమ్మేశానని, కొన్నవారు వారి పేరిట రిజిస్ట్రేషన్ మార్చుకోలేదని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ కారు కొన్నవారెవరనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్‌ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో వీరిని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. వక్ఫ్‌భూముల ఆక్రమణలపై పోరాటం చేస్తున్నందుకే మొయిజుద్దీన్‌ను హత్య చేసినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తుండగా, పోలీసులు ఆయన వాదిస్తున్న కేసులు, గతంలో వివాదాలకు సంబంధించిన విషయాలపై లోతుగా విచారిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెప్పారు.