హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇటీవల చోరీకి గురైన 60 రైఫిల్ బుల్లెట్లు, మూడు మ్యాగజిన్లను నగరంలోని పలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ (ఐఎన్ఎస్ఏఎస్) 60 రైఫిల్‌కు చెందిన కొన్ని రౌండ్లు, మూడు మ్యాగజిన్లు ఉన్న బ్యాక్‌ప్యాక్ చోరీకి గురైందంటూ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సిద్ధార్థ్‌సింగ్ చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 24న ఫిర్యాదు చేశారు.
డీజీపీ అంజనీకుమార్, రైల్వేస్, రోడ్ సేఫ్టీ ఏడీజీ బీ శివధర్‌రెడ్డి సూచన మేరకు రైల్వేస్ ఎస్పీ షేక్ సలీమా 8 బృందాలతో విచారణకు ఆదేశించారు. రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, బ్యాక్‌ప్యాక్‌ను దొంగిలించిన నిందితుడు ఆనందమూర్తిని గుర్తించి, గాంధీనగర్ మెట్రోస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
అతను బుల్లెట్లను మెట్రోపిల్లర్ వద్ద వదిలేసి, బ్యాగ్‌ను మాత్రమే తీసుకెళ్లానని చెప్పడంతో మరో వంద సీసీ కెమెరాలను పరిశీలించారు. వాకింగ్‌కు వచ్చిన రాచమల్ల సత్యనారాయణ అనే వ్యక్తి వాటిని తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతన్ని విచారించడంతో తానే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తీసుకెళ్తున్నట్టు తెలపడంతో బుల్లెట్లను, మూడు మ్యాగజిన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తన కార్యాలయంలో ఈ కేసును చాకచక్యంగా పరిష్కరించిన సిజీఆర్పీ, ఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించి, జ్ఞాపికలు అందజేశారు.