హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రతకు విస్తృతస్థాయిలో సీసీ కెమెరాలను వినియోగించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు తరచూ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రైల్వే రాష్ట్రస్థాయి సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. నేరాల కట్టడికి సీసీ కెమెరాలు కీలకమని, మానవ అక్రమ రవాణా కట్టడికి ‘ఆపరేషన్ ఆహాత్’ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఎస్టీఈఎంపై బాలల్లో అవగాహనాలోపం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల ఎస్టీఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) అధ్యయనాల గురించి బాల, బాలికలకు తగినంతగా అవగాహన లేదని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ అయిన చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్వై) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, దక్షిణ భారతదేశంలో 52% బాలికలు, 51% బాలురు ఎస్టీఈఎం గురించి ఎప్పుడూ వినలేదని తేలింది.