హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దవాఖాన నిర్మాణంతోపాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తనను ఏకంగా రూ.23 కోట్లకు మోసగించినట్టు న్యూజెర్సీ (అమెరికా)లో ఉంటున్న ప్రవాస భారతీయుడు కొమ్మినేని కల్యాణ్ హై దరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2015లో దయాచారి గుంటూరులోని పొగాకు బోర్డులో పనిచేస్తున్నప్పుడు స్నేహితుల ద్వారా తనకు పరిచయమయ్యాడని, ఆయన మాటలను నమ్మి పలు వ్యాపారాల్లో వేల డాలర్లు పెట్టుబడులు పెట్టానని కల్యాణ్ తెలిపారు. ఆ తర్వాత దయాచారి స్పందించడం మానేశాడని, తనతో పెట్టుబడులు పెట్టించిన వ్యాపారాలపై ఆరా తీయడంతో వాటిలో ఏదీ నిజం కాదని తేలిందని వివరించారు.
అనంతరం భారత్కు వచ్చి దయాచారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదని వాపోయారు. ప్రస్తుత మారక విలువ ప్రకారం తన పెట్టుబడులకు వడ్డీ కలిపితే రూ.23 కోట్లు అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇదే తరహాలో దయాచారి అనేక మంది నుంచి భారీగా డబ్బు సేకరించి, గుంటూరు తదితర ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది.