ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:41:11

కరోనా గాలి తిరుగుడు?

కరోనా  గాలి తిరుగుడు?

  • గాడ్పు వల్ల వైరస్‌ వ్యాపిస్తుందా?
  • దవాఖానల్లో సీసీఎంబీ ప్రత్యేక సర్వే
  • ‘నమస్తే తెలంగాణ’తో డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దాని పేరు కరోనా.. దానికి ఓ లెక్కంటూ ఉండదు. ఎక్కడపడితే అక్కడ వాలుతుంది. ఎవరిని పడితే వారిని అంటుకుంటుంది. ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు తీస్తుంది. లేకపోతే శరీరంలోకి చొరబడి అవయవాలను ఆరగించేస్తుంది. ఈ మహమ్మారి ఇంకెంత ప్రమాదం చేస్తుంది? ఇంకెంతమందికి సోకుతుంది? ‘గాలి’ తిరుగుళ్లు తిరుగుతూ వ్యాప్తిచెందుతుందా? అన్నకోణంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా? ఒకవేళ వ్యాప్తి చెందితే ఎంతదూరం వరకు విస్తరిస్తుంది? దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? అన్న అంశాలపై ఎయిర్‌శాంపిల్‌ సర్వే మొదలుపెట్టారు. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సర్వే చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి ఆధునిక ఎయిర్‌ టంప్లరీ యంత్రాన్ని తెప్పించారు. గాలిలో వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ నిర్దిష్టమైన ఆధారాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏమీ నిర్ధారించలేదు. అయితే, గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అనడానికి తమవద్ద ఆధారాలున్నాయని దాదాపు 200 మందికి పైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్యసంస్థకు నివేదించారు. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) కూడా గాలిలో వైరస్‌ వ్యాప్తి ఉండవచ్చన్న ప్రాథమిక నిర్ధారణతో పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఈ తరుణంలో సీసీఎంబీ చేపట్టిన తాజా పరిశోధన ఆసక్తికరంగా మారింది. దవాఖాన పరిసరాల్లో పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల నుంచి వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందన్న అంచనా వేసేందుకు ఈ పరిశోధన చేపట్టినట్టు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. కొన్ని రోజులక్రితమే ఈ అధ్యయనాన్ని పలు దవాఖానల్లో ప్రారంభించామన్నారు. ప్రధానంగా దవాఖానల్లోని ఐసీయూ ప్రాంతాల్లో నమూనాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. వైరస్‌ ఎన్ని అడుగుల దూరం వరకు గాలిలో వ్యాపిస్తుంది? ఎంతసేపు మనుగడలో ఉంటుంది? అన్న విషయాలను తేలుస్తామని వివరించారు. ఆ తర్వాత జనం గుమిగూడి ఉండే ప్రదేశాల్లోనూ సర్వే చేస్తామని,  పది రోజుల్లో ప్రాథమిక అవగాహనకు వస్తామన్నారు. తాము నిర్వహిస్తున్న సర్వేతో వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, ఇతర వ్యక్తులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల సర్వే జరుగుతున్న దవాఖానల వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని రాకేశ్‌మిశ్రా నమస్తే తెలంగాణకు చెప్పారు.


logo