గజ్వేల్, నవంబర్ 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి పత్తి రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడ్ సమీపంలోని జిన్నింగ్ మిల్లును సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి పత్తి కొనుగోళ్ల తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 40వేల ఎకరాల్లో పత్తి సాగైనట్టు తెలిపారు. పంట సాగు సమయంలో ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడిన రైతులను, అధిక వర్షాలు ఎంతగానో నష్టపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం పండించిన పత్తిని అమ్ముకుందామంటే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం పేరుతో మరింత జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రింగ్‌రోడ్ పక్కన నిర్మించిన కాటన్ మార్కెట్లో పత్తి కొనుగోలు చేయకపోతే మార్కెట్ ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.