హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఒకవైపు వర్షాలు లేవు.. మరోవైపు రైతులు పత్తిని శుభ్రంగా ఆరబెడుతున్నారు.. అయినా, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నదంటూ సీసీఐ అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. తద్వారా రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. దీంతో పత్తి రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మెజారిటీ రైతులకు గరిష్ఠ తేమ శాతాన్ని నమోదు చేస్తూ మద్దతు ధరలో కోత పెడుతున్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో తేమ శాతం 8% నుంచి 12% నిబంధన అమలు చేస్తున్నది. తేమ 12% మించి ఉంటే ఆ పత్తిని కొనుగోలు చేయదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 నిర్ణయించింది. తేమ శాతం ఆధారంగా 8-12% తేమలో ఒక్కో స్లాబ్‌కు ఒక్కో ధరను నిర్ణయించింది. తేమ శాతం పెరిగినా కొద్దీ మద్దతు ధరలో కోత పడుతుంది. 8% తేమ ఉంటే రూ.8,110, 9% ఉంటే రూ.8,029, 10% ఉంటే రూ.7,948, 11% ఉంటే రూ.7,867, తేమ 12% ఉంటే రూ.7,786 ధర నిర్ణయించింది. ఒకవేళ రైతులు తీసుకొచ్చిన పత్తిలో గరిష్ఠ (12) తేమ శాతం ఉంటే క్వింటాల్‌కు మద్దతు ధర కన్నా రూ.324 తక్కువ వస్తుంది.
తేమ తక్కువ ఉన్నా.. ఎక్కువ నమోదు
సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు సమయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని, తేమ శాతం నమోదులో తప్పుడు లెక్కలు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తిని శుభ్రంగా, బాగా ఆరబెట్టి తీసుకొచ్చినప్పటికీ, కొద్ది మంది రైతులకు మాత్రమే 8 శాతంగా నమోదు చేసి, మెజారిటీ రైతులకు 9 నుంచి 10% నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతాన్ని కొలిచే మిషన్ చూపించిన దాని కన్నా రెండు పాయింట్లు తక్కువగా నమోదు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో తాము పత్తిని పూర్తిగా ఆరబెట్టినప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఎందుకు వస్తున్నదని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉదా:ఒక రైతు 20 క్వింటాళ్ల మేలు రకపు పత్తిని తీసుకొస్తే, క్వింటాల్‌కు రూ.162 చొప్పున 20 క్వింటాళ్లకు రూ.3,240 నష్టపోవాల్సి వస్తున్నది. తేమ శాతాన్ని తప్పుగా నమోదు చేయడం వల్ల రైతులకు తక్కువ ధర దక్కుతుండగా, జిన్నింగ్ మిల్లులకు లింట్ ఎక్కువగా వచ్చి ఆ మేరకు లాభం చేకూరుతుంది. తేమ శాతాన్ని తప్పుగా నమోదు చేయడంపై పలువురు జిన్నింగ్ మిల్లర్లు సైతం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల తప్పిదాలతో రైతులు నష్టపోతున్నారని చెప్తున్నారు.
మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
మెదక్ రూరల్/దుబ్బాక, డిసెంబర్ 27: అప్పుల బాధ భరించలేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం నాగాపూర్‌కు చెందిన రైతు చింతకింది నర్సింహులు తనకున్న రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. సరైన దిగుబడులు రాక దాదాపు రూ.6 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన రైతు తొగుట చంద్రయ్య (69)కు మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఆర్థిక సమస్యలతోపాటు కొన్నాళ్లుగా మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన చంద్రయ్య గ్రామ శివారులోని ఓ రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
క్వింటాల్ పత్తిలో ఎంత తేమ శాతానికి ఎంత ధర (రూపాయల్లో..)
తేమ శాతం ధర