హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ ఫలితాల్లో సీబీఎస్ఈ విద్యార్థులదే పైచేయిగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా ఇదే తీరు పునరావృతమవుతున్నది. 324 మార్కుల కన్నా అధికంగా సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో అత్యధిక సీట్లను సీబీఎస్ఈ విద్యార్థులే ఎగరేసుకుపోతున్నారు. గత నాలుగేండ్లుగా 720 మార్కుల నుంచి 324 మార్కులు సాధించిన వారి వివరాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది. ఏటా నీట్‌కు రాష్ర్టాల బోర్డుల నుంచే అత్యధిక విద్యార్థులు హాజరవుతున్నారు. 70 శాతానికి పైగా విద్యార్థులు రాష్ర్టాల బోర్డుల నుంచే ఉండగా, 30 శాతం లోపు మాత్రమే సీబీఎస్ఈ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. సరాసరి కటాఫ్ 324 మార్కులుగా ఉంటుండగా, 720 నుంచి 324 మార్కుల లోపు సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులే ఎక్కువగా ఉంటుండటంతో అధిక శాతం సీట్లు వాళ్లే దక్కించుకొంటున్నారు.
రాష్ట్రాల బోర్డుల్లోను ఉత్తమ ఫలితాలు
సీబీఎస్ఈ విద్యార్థులతో పాటుగా రాష్ర్టాల బోర్డుల విద్యార్థులు సైతం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 324 కన్నా అధిక మార్కులు సాధించే వారి శాతం ఏటా పెరుగుతున్నది. పశ్చిమబెంగాల్, గుజరాత్లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నది. ఇటీవల నీట్ యూజీ పరీక్షల విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేపట్టిన మార్పులు రాష్ట్రాల విద్యార్థులకు అనుకూలంగా మారాయి. రాష్ర్టాలు కరిక్యులం మార్చడం సైతం ఇందుకు దోహదపడుతున్నది.