హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సీబీఐ అధికారులు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఆయా తేదీల్లో ఎప్పుడైనా రావచ్చునని ఎమ్మెల్సీ కవిత ఈ-మెయిల్ పంపిన నేపథ్యంలో సీబీఐ అధికారులు మంగళవారం సాయంత్రం ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ నెల 11 ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో సమావేశం అవుదామని సీబీఐ ఢిల్లీ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆమెకు ఈ-మెయిల్ పంపారు. ఇందుకు అంగీకరిస్తూ కవిత కూడా మెయిల్ ద్వారానే సమ్మతిని తెలిపారు.
సీబీఐ అధికారులు తొలుత మంగళవారం సమావేశం అవుతామని ఎమ్మెల్సీ కవితకు తెలుపగా, ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆ రోజు వీలుపడదని ఆమె సోమవారం సాయంత్రం సీబీఐకి లేఖ రాశారు. ఆ రోజు రాత్రి వరకు స్పందన లేకపోవడంతో సీబీఐ బృందం రావొచ్చన్న ఊహాగానాలతో మంగళవారం ఉదయం నుంచే కవిత ఇంటి వద్ద హడావుడి నెలకొన్నది. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్సీ కవిత మంగళవారం జగిత్యాల వెళ్లాల్సి ఉన్నది. సీబీఐ నుంచి స్పందన రాకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేసుకొన్నారు. సాయంత్రం సీబీఐ నుంచి కవితకు మెయిల్ రావడం, ఆమె కూడా సమ్మతి తెలియజేయడంతో ఊహాగానాలకు తెరపడింది.