హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తేతెలంగాణ) : టీజీపీఎస్పీ గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ ఆజా ది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ జనరల్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడారు. ప్రభుత్వం జీవో 55ను రద్దు చేసి జీవో 29 జారీ చేయడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. రిజర్వేషన్ క్యాటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం కేటాయించి మిగతా 50 శాతం పోస్టులను అగ్రవర్ణాల వారికి కట్టబెట్టే కుట్రకు తెరలేపిందని విమర్శించారు. తెలుగు మీడియం అభ్యర్థుల ప్రమాణాలకు అనుగుణంగా వాల్యుయేషన్ చేయలేదని ఆక్షేపించారు. సీబీఐ సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని కోరారు.